అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును సభలోనే ఎండగట్టారు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్. బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ప్రజల కంటే.. వాళ్ల కుటుంబమే ముఖ్యం అయ్యిందంటూ దుమ్మెత్తిపోశాడు. ఓ అడుగు ముందుకేసి.. కేసీఆర్.. మీ పార్టీ ఎమ్మెల్యేలకు నేర్పించిన సంస్కారం ఇదేనా అంటూ ప్రశ్నించారు అక్బరుద్దీన్ ఓవైసీ. అసెంబ్లీలో ఈ రోజు చీకటి రోజని ఫైర్ అయ్యారు.
ఒక కుటుంబం కోసమే బీఆర్ఎస్ అసెంబ్లీలో ఆందోళన చేస్తుందని మండిపడ్డారు అక్బరుద్దీన్. ఒక వ్యక్తి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంత రచ్చ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేవారు. బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం ఇదేనా.? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుల తీరు అభ్యంతకరన్నారు.. బీఆర్ఎస్ కు ప్రజలు అవసరం లేదు.. వారికి పార్టీనే ముఖ్యమన్నారు.
ముమ్మాటికీ ధరణి లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు అక్బుర్దీన్ ఓవైసీ. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ళు తెలంగాణ లో కచర గవర్నమెంట్ ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కోసం వచ్చారా...? లేక కేసీఆర్ కుటుంబం కోసం వచ్చారా అని ప్రశ్నించారు అక్బుర్దీన్ .
ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై చర్చ జరపాలంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. సీట్లలో కూర్చోకుండా.. ప్లేకార్డులతో నిరసనకు దిగారు. స్పీకర్ ఎంత సర్దిచెప్పినా వినకుండా.. నిబంధనలకు విరుద్దంగా పోడియం వైపు దూసుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. హరీశ్ రావు ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యేలు పోడియం వైపు వెళుతుంటే.. సభలోని మార్షల్స్ అడ్డుకున్నారు. అయినా వినకుండా.. బలంగా తోసుకొచ్చారు. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్ నెట్టేస్తూ.. పోడియం దగ్గరకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పేపర్లు చింపి గాల్లోకి ఎగరేశారు.