న్యూఢిల్లీ: త్వరలో సేవలు మొదలుపెట్టబోతున్న ఆకాశ ఎయిర్ తాజాగా ఫ్లైట్ బుకింగ్‌లను ప్రారంభించింది. వచ్చే నెల 7న ఆకాశ విమానాలు మొదటిసారిగా ఆకాశంలోకి ఎగరనున్నాయి. ఆకాశ ఎయిర్ మ్యాక్స్ విమానం బోయింగ్ స్కై ఇంటీరియర్ ఎల్ఈడీ లైటింగ్‌తో వస్తుంది. మొదటి 19 విమానాల్లో 189 చొప్పున సీట్లు ఉంటాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రతి సీటుకు యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. విమానంలో వైఫై లేనప్పటికీ, విస్తారా, స్పైస్‌జెట్ మాదిరిగానే త్వరలో స్ట్రీమింగ్ సేవను ప్రారంభించనుంది. ఆకాశ ఎయిర్‌లో ఇన్‌ఫ్లైట్ క్యాటరింగ్ సర్వీస్ ఉంటుంది. మెనులో శాండ్విచ్లు, క్రోసెంట్లు, టార్ట్‌లు, రోల్స్, బర్గర్లు, పూరి, ఉప్మా వంటివి ఉన్నాయి. అన్నీ ప్రీ –-బుకింగ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. స్వీట్లు ఇష్టపడే వారు రసమలై, చీజ్‌కేక్, చాక్లెట్ ట్రఫుల్, బేక్డ్ యోగర్ట్ ను కూడా కొనుక్కోవచ్చు. విమానంలో కొన్న వాటికంటే ముందస్తుగా బుక్ చేసుకున్న భోజనాల రేటు ఎక్కువగా ఉంటుంది. సెలవులకు బుక్ చేసుకోవడానికి ఆకాశ ట్రిప్ అడ్మిట్తో జతకట్టింది. హోటల్స్, కార్ రెంటల్స్ కోసం ఎవిస్తో చేతులు కలిపింది. ఆకాశ మొదట ముంబై– అహ్మదాబాద్ మధ్య, బెంగళూరు, కొచ్చి రూట్ల మధ్య విమానాలు నడుపుతుంది.
