ఇంఫాల్/భువనేశ్వర్: కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణ చేశారు. శుక్రవారం ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి కృష్ణకుమార్.. మణిపూర్ 19వ గవర్నర్‌గా భల్లా చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అత్యధిక కాలం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి ఘనత సాధించిన భల్లా.. గతేడాది ఆగస్టులో తన పదవీకాలాన్ని పూర్తి చేశారు. అతను అస్సాం- మేఘాలయ కేడర్‌కు చెందిన 1984- బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత నెలలో భల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. గురువారం ఇంఫాల్‌కు చేరుకున్న భల్లాకు సీఎం బీరెన్ సింగ్ స్వాగతం పలికారు.
ఒడిశా గవర్నర్‌గా హరిబాబు కంభంపాటి..
ఒడిశా 27వ గవర్నర్‌గా హరిబాబు కంభంపాటి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం భువనేశ్వర్ లోని రాజ్‌భవన్‌లో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్ కంభంపాటితో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సీఎం మోహన్ చరణ్ మాఝీ, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరయ్యారు.
గురువారం మధ్యాహ్నం భువనేశ్వర్‌కు చేరుకున్న కంభంపాటి.. కుటుంబ సభ్యులతో కలిసి పూరీ జగన్నాథుడిని సందర్శించుకున్నారు. మిజోరం గవర్నర్‌గా పనిచేసిన కంభంపాటిని ఒడిశా గవర్నర్‌గా రాష్ట్రపతి ముర్ము గత డిసెంబర్ 24న నియమించారు.