కొత్త ఎన్‌‌‌‌ఈపీ రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి..ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విభాగం డిమాండ్ 

  • చలో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తత

బషీర్ బాగ్, వెలుగు: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌‌‌‌పీఈ) రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌) రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది.  ఎన్‌‌‌‌పీఈని రద్దుకు అనుకూలంగా అసెంబ్లీలో  తీర్మానం చేయాలనే డిమాండ్‌‌‌‌ తో ఏఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ నేతలు.. శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.  పోలీసులు అడ్డుకోవడంతో ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.  ఏఐఎస్ఎఫ్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.   పోలీసులు వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.." ఎన్‌‌‌‌పీఈతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.  విద్యార్థులపై మతతత్వ భావజాలాన్ని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలి. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల సూసైడ్స్​పై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలి. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ లను నివారించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసి, భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలి" అని డిమాండ్ చేశారు.