న్యూఢిల్లీ: భారత్‌లో గాలి కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. మెట్రో పాలిటన్ నగరాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. ఇందుకు దేశ రాజధాని ఢిల్లీనే ఉదాహరణ. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో గాలిలో నాణ్యత క్షీణించిందన్న వార్తలను చూస్తూనే ఉన్నాం. ఈ విషయాన్ని పక్కనబెడితే.. గత ఏడాది గాలి కాలుష్యం వల్ల దేశంలో సుమారు 17 లక్షల మంది చనిపోయారని ఓ సర్వే ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. 2019లో దేశంలో చనిపోయిన వారిలో ఎయిర్ పొల్యూషన్‌తో మృతి చెందిన వారి సంఖ్య 18 శాతంగా ఉంది. వాయు కాలుష్యం వల్ల అనారోగ్యానికి గురైన వారు, చనిపోయిన వారితో భారత జీడీపీకి 1.4 శాతం నష్టం వాటిల్లింది. జీడీపీ పరంగా నష్టపోయిన రాష్ట్రాలను చూసుకుంటే.. ఉత్తర్ ప్రదేశ్ (2.15 శాతం), బిహార్ (1.95 శాతం) నష్టపోగా.. దక్షిణ భారత్‌లో కర్నాటక (1.22 శాతం), ఆంధ్రప్రదేశ్ (1.09 శాతం), తమిళనాడు (1.06 శాతం) నష్టపోయాయి. ఈ నివేదికను లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అనే సంస్థ వెల్లడించింది.
