విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై స్పందిస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ లేఖ
ఈ ఏడాది జూలై లో ఆంధ్ర ప్రదేశ్ లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను ఆ సంస్థ తిరిగి పునరుద్ధరించనుంది. దానితో పాటు మరికొన్ని కొత్త విమాన సర్వీసులు విజయవాడ-తిరుపతి-వైజాగ్, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు రూట్లలో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపింది.
విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీకి వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి లేఖ రూపంలో తెలియజేశారు. రద్దు చేసిన విమాన సర్వీసులను సత్వరమే పునరుద్ధరించడంతోపాటు వైజాగ్-విజయవాడ-బెంగుళూరు, వైజాగ్-విజయవాడ-తిరుపతి మధ్య డైలీ విమాన సర్వీసులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విజయవాడ, వైజాగ్, తిరుపతి, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని కూడా కోరుతూ విజయసాయి రెడ్డి ఎయిర్ ఇండియా చైర్మన్ లొహానీకి లేఖ రాశారు. ఆ లేఖకు లొహానీ ప్రత్యుత్తరమిస్తూ ప్రస్తుతం ఢిల్లీ-విజయవాడ మధ్య వారానికి మూడుసార్లు నడుపుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసును అక్టోబర్ 27 నుంచి ఢిల్లీ-విజయవాడ-తిరుపతి-విజయవాడ-ఢిల్లీ సర్వీసుగా నడపనున్నట్లు తెలియజేశారు. లొహానీ ప్రకటనతో విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా చైర్మన్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

