విమానం గాల్లో ఉండగా ఆగిన శ్వాస.. చిన్నారిని కాపాడిన డాక్టర్లు

విమానం గాల్లో ఉండగా ఆగిన శ్వాస.. చిన్నారిని కాపాడిన డాక్టర్లు
  • బెంగళూరు నుంచి ఢిల్లీవెళ్తుండగా ఘటన
  • విమానంలోనే45 నిమిషాలు ట్రీట్​మెంట్

న్యూఢిల్లీ:  బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో రెండేండ్ల చిన్నారికి ఎయిమ్స్ డాక్టర్లు ప్రాణం పోశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్ చేసి బతికించారు. విస్తారా ఎయిర్​లైన్స్ విమానం ఆదివారం సాయంత్రం బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణికుల్లో ఓ కుటుంబం.. గుండె సమస్యతో బాధపడుతున్న తమ రెండేండ్ల చిన్నారిని చికిత్సకోసం ఢిల్లీకి తీసుకెళ్తోంది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడం ఆగింది. పెదాలు, వేళ్లు కూడా నీలి రంగులోకి మారిపోయాయి. సమాచారం తెలుసుకున్న విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫ్లైట్​ను నాగ్‌పూర్ వైపునకు మళ్లించారు. 

ఐదుగురు డాక్టర్ల బృందం

విమానం​లో ఎవరైనా డాక్టర్లు ఉంటే వెంటనే చిన్నారికి సాయంచేయాలని సిబ్బంది అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్ల బృందం చిన్నారి వద్దకు వెళ్లింది. వీరు ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సదస్సుకు హాజరై.. ఢిల్లీకి వెళ్తున్నారు. చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడాన్ని గమనించి సీపీఆర్ చేయడంతో ఆ పాప తిరిగి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది. 

ఐదుగురు డాక్టర్లు సుమారు 45 నిమిషాలు శ్రమించారు. చివరికి పాప హెల్త్ కండీషన్ స్టేబుల్ కావడంతో విమానంలోని ప్రయాణికులంతా డాక్టర్ల​కు ధన్యవాదాలు చెప్పారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ పాపను హాస్పిటల్​కు తరలించారు. పాపకు ప్రాణం పోసిన వైద్యులు..  డాక్టర్ నవదీప్ కౌర్, డాక్టర్ దమన్​దీప్ సింగ్, డాక్టర్ రిషబ్ జైన్, డాక్టర్ ఓషికా, డాక్టర్ అవిచలా టాక్సాక్ అని విస్తారా ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది.