అన్నాడీఎంకే అధికార పగ్గాలపై చెన్నైలో కీలక మీటింగ్

అన్నాడీఎంకే అధికార పగ్గాలపై  చెన్నైలో కీలక మీటింగ్

అన్నాడీఎంకేలో అధికార పగ్గాలపై ఇవాళ చెన్నైలో కీలక మీటింగ్ జరుగుతోంది. ఒక్క నేత ఆధ్వర్యంలోనే పార్టీ ముందుకెళ్లాలని నిర్ణయించారు. దీంతో అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్ కీలకంగా మారింది. మాజీ సీఎం, పార్టీ కో-  కో ఆర్డినేటర్ పళనిస్వామి, అలాగే పార్టీ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం మధ్య గ్రూప్ వార్ పెద్దగానే జరుగుతోంది. అన్నాడీఎంకేలోని పలువురు కీలక నేతలు తమ క్యాంప్ లను మారుస్తున్నారు. పార్టీపై పట్టు సాధించేందుకు పన్నీర్ సెల్వం, పళనిస్వామి పట్టుదలతో ఉన్నారు. 



పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ రెండు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14న జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ వ్యవహారం మరింతగా ముదిరింది. నిన్నటికి నిన్న జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిరోసిన్  పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 



అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్  భేటీ సందర్భంగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు బలప్రదర్శన నిర్వహించాయి. ఇవాళ్టి పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయబోతున్నారు. అదే సమయంలో... తన సంతకం లేకుండా జనరల్  బాడీ ఆ తీర్మానాన్ని ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్  సెల్వం తన లైన్ లో ఉన్నారు. అన్నాడీఎంకే జనరల్  కౌన్సిల్  భేటీ జరగకుండా వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. అయితే ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పార్టీ జనరల్  కౌన్సిల్  భేటీ అంతర్గత విషయమని, దాన్ని ఆపాలని ఆదేశించలేమని బెంచ్  స్పష్టం చేసింది. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్  హైకోర్టు. దీంతో ఇవాళ్టి భేటీ వాడివేడిగా జరుగుతోంది.