అన్నాడీఎంకే నుంచి పన్నీర్ బహిష్కరణ

అన్నాడీఎంకే  నుంచి పన్నీర్ బహిష్కరణ

అన్నా డీఎంకే నేత  పన్నీర్ సెల్వానికి షాక్ ల మీద షాక్ లు తగిలాయి. పార్టీ నుంచి పన్నీర్ సెల్వంను బహిష్కరించాలన్న తీర్మానాన్ని జనరల్ కౌన్సిల్ సమావేశంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి పాస్ చేశారు. దీంతో పార్టీ ప్రైమరీ మెంబర్ షిప్ నుంచి పన్నీర్ ను పళనీస్వామి తొలగించారు. పన్నీర్  పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా పన్నీర్ సెల్వం మద్దతుదారులను కూడా పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. పార్టీలో ఒకే నాయకత్వాన్ని తీసుకురావాలని జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు 

అంతకు ముందే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించొద్దన్న పన్నీర్ సెల్వం పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పునరుద్ధరించి.. కోఆర్టినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేశారు పళనిస్వామి. దీంతో పార్టీ నాయకత్వ పగ్గాలు ఎవరైనా ఒక్కరే చేపట్టే ఛాన్స్ ఉంటుంది. గతంలో పళని స్వామి, పన్నీర్ సెల్వం పార్టీ లీడర్ షిప్ పంచుకోగా.. కొత్త ప్రతిపాదనతో ఈ ట్రెడిషన్ కు తెరపడింది. మీటింగ్ లో 16 కీలక ప్రతిపాదనలు ఆమోదం తెలిపారు.



పళని స్వామి నిర్ణయంతో పన్నీర్ సెల్వం మద్దతు దారులు భారీగా ఆందోళన చేపట్టారు. చెన్నై రాయపేట లోని అన్నా DMK పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల కార్యకర్తల మధ్య భారీగా ఘర్షణ జరిగింది. పళని స్వామికి స్వాగతం చెప్పేందుకు భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పళని స్వామి వస్తుండగా.. పన్నీర్ సెల్వానికి మద్దతిస్తున్న వారు నినాదాలు చేశారు. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నాయి. తమదే పార్టీ అంటే... తమదే పార్టీ అంటూ OPS, EPS వర్గాల కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. ఘర్షణ కాస్త ముదరటంతో...ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కోర్టు తీర్పురాకముందే ఇరు వర్గాల ప్రజలు ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరారు. డీఎంకే పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 



పళని స్వామికి మద్దతుగా తీర్పు రావడంతో.. OPS మద్దతు దారులు రచ్చ చేశారు.  EPS కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పార్టీ ఆఫీస్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. మీటింగ్ అడ్డుకునేందుకు పన్నీర్ సెల్వం మద్దతు దారులు ప్రయత్నించారు. పార్టీ ఆఫీస్ లోకి వెళ్లి కుర్చీలు విరగ్గొట్టి.. పన్నీర్ సెల్వం మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. మరికొందరు పళని స్వామి ఉన్న వాల్ పేపర్లను చించేశారు. మరోవైపు... మీటింగ్ ప్రాంతంలో, పార్టీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్తలు జరగకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధికారులు.