రైతు వేదికల్లో సంబరాలు .. రైతులకు కలిగిన మేలు తెలిపేలా కార్యక్రమాలు

  • విస్తృతంగా ఏర్పాటు చేస్తున్న వ్యవవసాయ శాఖ 
  • ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపు

మెదక్, వెలుగు:  మెదక్ జిల్లాలో  ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఈనెల 28, 29, 30 తేదీల్లో మహబూబ్​ నగర్​లో  రైతు పండగ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా..  అన్ని జిల్లాల్లో  రైతు వేదికలు, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో సంబరాలు నిర్వహించనున్నారు.  ఏడాది కాలంలో ప్రభుత్వ పరంగా రైతులకు కలిగిన మేలు, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.  మెదక్  జిల్లాలో  రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున  2023-–24 యాసంగి సీజన్ కు మొత్తం 2,63,933 మంది రైతుల ఖాతాల్లో రూ.194.54 కోట్లు జమ అయ్యాయి. 

     రూ.604  కోట్ల రుణ మాఫీ

  •  రైతు రుణ మాఫీ పథకం కింద మెదక్ జిల్లాలో  మొత్తం 82,294 మంది రైతుల ఖాతాలో రూ.604.21 కోట్లు జమ అయ్యాయి. మొదటి విడత లో  రూ.లక్ష వరకు  48,251 రైతులకు రూ.240.78 కోట్లు, రెండవ విడతలో  రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు  21,618 రైతులకు రూ.204.40 కోట్లు, మూడో విడత లో రూ.2 లక్షల వరకు 12,425 రైతులకు రూ .159.03 కోట్లు మాఫీ అయ్యాయి. 
  •    రైతు బీమా పథకం కింద డిసెంబర్ 2023 నుంచి నవంబర్ 2024 వరకు జిల్లాలో మరణించిన 1,029 మంది రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ.54 కోట్లు అందాయి. 
  •    గత ఏడాదిలో 5,599 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు 60 శాతం రాయితీ పై రైతులకు సరఫరా చేశారు. ఇందులో జీలుగ 4,017 క్వింటాళ్ల,  జనుము 1,582 క్వింటాళ్లను పంపిణీ చేశారు. 

   రూ.71 లక్షల పరిహారం

ఈ ఏడాది మార్చిలో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని వివిధ మండలాల్లో 714 ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్ట పోయారు. బాధితులైన  957 మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల  చొప్పున రూ.71,44,250 నేరుగా రైతుల అకౌంట్ లలో  నష్ట పరిహారం జమ చేశారు. 

సన్న వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్​ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ సీజన్ లో పీఏసీఎస్​, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 8,280 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు  చేశారు. ఇందుకు సంబంధించి148 మంది రైతులకు కనీస మద్దతు ధర కింద రూ.1.89 కోట్లు, బోనస్​ కింద రూ.39.95 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కనీస మద్దతు ధర కింద రూ.36.08 లక్షలు, బోనస్​ కింద రూ.7.77 లక్షలు రైతుల బ్యాంక్​ ఖాతాల్లో జమచేశారు. 

ALSO READ : రైతు భరోసా సున్నా.. రుణమాఫీ అరసున్నా: కేటీఆర్​

పండగ వాతావరణంలో

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రైతు పండగ ను జిల్లాలోని అన్ని రైతు వేదికలు, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో  నిర్వహించనున్నాం. ఈ సందర్భంగా గడచిన ఏడాది కాలంలో రైతు భరోసా, రైతు బీమా, రుణ మాఫీ, విత్తనాల సబ్సిడీ, సన్న వడ్లకు బోనస్​ ద్వారా రైతులకు కలిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తాం.  జిల్లాలో రుణ మాఫీ ప్రక్రియ 60 శాతం పూర్తయ్యింది. రూ.2 లక్షల వరకు లోన్​ ఉండి వివిధ కారణాల వల్ల రుణ మాఫీ కాని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాం. త్వరలో సంబంధిత రైతులకు కూడా రుణ మాఫీ కానుంది. 

గోవింద్, డీఏవో, మెదక్ జిల్లా