ఢిల్లీలో కూర్చుంటే వ్యవసాయం జరగదు

ఢిల్లీలో కూర్చుంటే వ్యవసాయం జరగదు
ముంబై: కొత్త వ్యవసాయ చట్టాల అమలు విషయంలో రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఫైర్ అయ్యారు. సూచనల కోసం రాష్ట్రాలను కేంద్ర సర్కార్ సంప్రదించలేదన్నారు. ఢిల్లీలో కూర్చుంటే వ్యవసాయం జరగదన్నారు. ‘ఢిల్లీలో కూర్చుంటే వ్యవసాయం అవ్వదు. ఎందుకంటే వ్యవసాయం చాలా శ్రమతో కూడుకున్నది. పంట పండించడానికి గ్రామాల్లో రైతులు తీవ్రంగా కష్టపడతారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకూ జవాబుదారీతనం ఉంది. నాతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొత్త అగ్రి చట్టాల్లో చేర్చాల్సిన సంస్కరణల గురించి కేంద్రానికి వివరించాం. అయితే మా సూచనలు, సలహాలను పట్టించుకోలేదు. ఈ చట్టాలపై అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కేంద్రం సుదీర్ఘ చర్చలు జరిపింది. కానీ వారి సూచనలను పెడచెవిన పెట్టింది’ అని పవార్ పేర్కొన్నారు.