కేంద్రాన్ని డిమాండ్ చేసిన దీదీ
మిడ్నాపూర్(వెస్ట్ బెంగాల్): రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాల్సిందేనని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రానికి తేల్చి చెప్పారు. చట్టాలను రద్దు చేయకుంటే కేంద్ర సర్కారు గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులను కాలరాస్తున్న చట్టాలను తీసుకొచ్చిన ఎన్డీఏ సర్కారుకు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. ఈమేరకు సోమవారం వెస్ట్ మిడ్నాపూర్జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న దీదీ కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అయితే, అగ్రి చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన బంద్కు మాత్రం మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు.
తమ రాష్ట్రంలో బంద్ పాటించబోమని తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపైన పోరాడతామని మమత చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను చూస్తూ మౌనంగా ఉండడం, బీజేపీ సర్కారుతో దోస్తీ చేయడం తమ వల్ల కాదని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆటలను ఎన్నటికీ సాగనివ్వబోనని తేల్చి చెప్పిన మమతా బెనర్జీ.. ఆ పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
