ప్రతిష్టాత్మక ‘అగ్నిపథ్’ స్కీమ్ ప్రారంభం

ప్రతిష్టాత్మక ‘అగ్నిపథ్’ స్కీమ్ ప్రారంభం

సైన్యంలోని త్రివిధ దళాల్లో సేవచేయాలని భావించే యువతకు అవకాశాన్ని కల్పించే ప్రతిష్టాత్మక  ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీన్ని చారిత్రక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా తొలి బ్యాచ్ లో  17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయస్కులు దాదాపు 45,000 మందిని నాలుగేళ్ల స్వల్ప కాలపరిమితి  కోసం సైన్యంలో భర్తీ చేసుకోనున్నారు. వచ్చే 90 రోజుల్లోగా దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని రాజ్ నాథ్ వెల్లడించారు. 2023 జూలై నాటికి తొలి బ్యాచ్ శిక్షణ పూర్తవుతుందన్నారు. 

ఏమిటీ అగ్నిపథ్.. 

‘అగ్నిపథ్’  స్కీమ్ కు ఎంపికయ్యే వారిని ‘అగ్నివీర్స్’ అని పిలువనున్నారు.  అభ్యర్థుల ఎంపిక కోసం ఆన్ లైన్ పరీక్షను నిర్వహించనున్నారు. ఆర్మీలో రెగ్యులర్ నియామకాల కోసం ఉండే విద్యార్హతలే.. అగ్నిపథ్ నియామక ప్రక్రియకూ ఉంటాయి. అగ్ని వీర్ల నాలుగేళ్ల కాలపరిమితిలో .. 6 నెలల శిక్షణా కాలం కూడా కలిసి ఉంటుంది. ఈ వ్యవధిలో అగ్ని వీర్లకు ప్రతినెలా రూ.30వేల నుంచి రూ.40వేల దాకా వేతనంతో పాటు రూ.48 లక్షల బీమా కవరేజీ, వైద్య ప్రయోజనాలను కల్పిస్తారు.  నాలుగేళ్ల తర్వాత ‘అగ్నిపథ్’  బ్యాచ్ లోని కేవలం 25 శాతం మంది సైనికులనే సర్వీసులో కొనసాగిస్తారు. ఇలా కొనసాగే వాళ్లకే రెగ్యులర్ ఆర్మీ క్యాడర్ లలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇటువంటి వారు నాన్ ఆఫీసర్ ర్యాంకులో 15 ఏళ్లపాటు  సైన్యానికి సుదీర్ఘ  సేవలందించవచ్చు.

మిగతా వారంతా 12 లక్షల ప్యాకేజీతో.. 

అగ్నిపథ్ బ్యాచ్ లోని మిగతా వారంతా దాదాపు రూ.12 లక్షల ప్యాకేజీతో సర్వీసు నుంచి వైదొలగుతారు.  బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.  అయితే వీరు పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు కాదు. ‘అగ్నిపథ్’  స్కీమ్ ను విజయవంతంగా అమలు చేయగలిగితే.. భారత ప్రభుత్వ వార్షిక రక్షణ బడ్జెట్ (దాదాపు రూ.5.2 లక్షల కోట్లు)  లో దాదాపు సగం ఉండే ఆర్మీ వేతన, పెన్షన్ బిల్లుల వ్యయం గణనీయంగా తగ్గిపోతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది.