ఏజీజీకే ట్రేడర్స్ లో పోలీసుల తనిఖీ

అయిజ, వెలుగు : అయిజ లో రియల్ ఎస్టేట్  వ్యాపారం పేరుతో ఇటీవల ఏజీజీకే ట్రేడర్స్  ఇండియా ప్రైవేట్  లిమిటెడ్  ఆఫీస్​ను పోలీసులు తనిఖీ చేశారు. గుజరాత్  రాష్ట్రం గాంధీనగర్ కు చెందిన కుందన్  ముఖ్వానా రియల్  ఎస్టేట్  వ్యాపారం చేసేందుకు ఆఫీస్  ప్రారంభించాడు. ఏజీజీకే ట్రేడర్స్ లో రూ. లక్ష పెట్టుబడి పెడితే, నెలకు రూ.40 వేలు లాభం ఇస్తామని ప్రచారం చేశారు. ఇలా 3 నెలల్లో రూ.10  నుంచి రూ.15 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది.

ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, శుక్రవారం ఎస్ఐ విజయభాస్కర్  ఏజీజీకే ట్రేడర్స్  ఆఫీస్​కు వెళ్లి ఫైళ్లు పరిశీలించారు. ఈ విషయమై ఎస్ఐని వివరణ కోరగా.. పూర్తిస్థాయిలో పరిశీలన చేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. మోసం జరిగిన్నట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.