కొత్తగూడెం ప్రజలకు ఈ విషయం తెలుసా..? అంతా అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే​ ప్రకటన

  • 1/70 పరిధిలోని గ్రామాల విలీనంతో ఆగిన ఫైలు
  • ఆయా గ్రామాలను మినహాయించి తిరిగి ప్రతిపాదనలు పంపేందుకు ఎమ్మెల్యే, ఆఫీసర్ల కసరత్తు 
  • అంతా అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో కార్పొరేషన్​ ప్రకటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటుకు ఏజెన్సీ చిక్కులు వెంటాడుతున్నాయి. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీతో పాటు లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్​ మండలాలను కలుపుతూ కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న కార్పొరేషన్​ ఏర్పాటు  విషయమై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన వెలువడుతుందని ఎమ్మెల్యేతో పాటు ఆఫీసర్లు, ప్రజలు ఆశించారు. కానీ రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చేసిన ప్రకటనలో కొత్తగూడెం లేకపోవడంతో ఖంగుతిన్నారు.

దీనికి కారణం కార్పొరేషన్​లో విలీనం అయ్యే లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్​ మండలాల్లోని పలు గ్రామాలు1/70 పరిధిలో ఉండడమేనని తెలిసింది. ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్​ ఏర్పడితే పలువురు కోర్టులకు వెళ్లే అవకాశం ఉండడంతో ఆ ఫైల్​ను ఉన్నతాధికారులు పెండింగ్​లో పెట్టారు. 

ఇప్పుడు విలీన గ్రామాలను పక్కన పెట్టి..

ఇప్పుడు ఏజెన్సీలోని విలీన గ్రామాలను పక్కన పెట్టి కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటుకు ఎమ్మెల్యేతో పాటు ఆఫీసర్లు కొత్తగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు నాన్​ ఏజెన్సీగా ఉన్న సుజాతనగర్​ ప్రాంతాన్ని కలుపుతూ కార్పొరేషన్​ ఏర్పాటుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రపోజల్స్​ పంపారు. మొదటి దశలో కార్పొరేషన్​ ఏర్పాటు చేస్తూ ప్రకటన వెలువడిన తర్వాత రెండో దశలో విలీన గ్రామాల విషయమై ప్రతిపాదనలు రూపొందించే అవకాశాలున్నట్టుగా పలువురు పేర్కొంటున్నారు.

దీనిపై త్వరలో జరుగనున్న క్యాబినెట్​ మీటింగ్​లో చర్చించనున్నట్టు తెలిసింది. కాగా కార్పొరేషన్​ ఏర్పాటులో నెలకొన్న అడ్డంకులను అధిగమించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి నాలుగు రోజుల కింద ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా కార్పొరేషన్​ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.