న్యూస్​ చానెల్స్​ రేటింగ్స్ కు లైన్ క్లియర్..

న్యూస్​ చానెల్స్​ రేటింగ్స్ కు లైన్ క్లియర్..
  • బార్క్​ డేటాను విడుదల చేయొచ్చన్న ఎంఐబీ
  • మూణ్నెల్ల రేటింగ్స్​ కూడా ఇవ్వాలని సూచన
  • ట్యాంపరింగ్​ కేసుతో ఏడాదిన్నరగా ఆగిన రేటింగ్స్​
  • బార్క్​ డేటాను విడుదల చేయొచ్చన్న ఎంఐబీ
  • మూణ్నెల్ల రేటింగ్స్​ కూడా ఇవ్వాలని సూచన
  • ట్యాంపరింగ్​ కేసుతో ఏడాదిన్నరగా ఆగిన రేటింగ్స్​

న్యూఢిల్లీ: దేశంలో వార్తల చానెళ్ల రేటింగ్స్ ను ఇక నుంచి విడుదల చేయచ్చని కేంద్ర సమాచార, ప్రసార శాఖ (ఎంఐబీ) చెప్పింది. న్యూస్ చానెల్స్ కు చాలాకాలంగా నిలిపేసిన రేటింగ్స్ ను వెంటనే మొదలుపెట్టాలని రేటింగ్స్ సంస్థ BARCకు సూచించింది. దీంతో పాటే గత మూడు నెలల రేటింగ్ డేటాను కూడా విడుదల చేయాలని చెప్పింది. 2020లో ముంబైలో మీటర్ల ట్యాంపరింగ్ వివాదంతో దేశ వ్యాప్తంగా అన్ని భాషల న్యూస్ చానెళ్లకు రేటింగ్ ఇచ్చే ప్రాసెస్ నిలిపేయాలని బార్క్ సంస్థ నిర్ణయించింది. న్యూస్ రేటింగ్స్ ప్రక్రియలో ఉన్న టెక్నికల్ లోపాలపై ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్ట్ తో పాటు టెలికం రెగ్యులేటరీ అథారిటీ సిఫార్సుల ఆధారంగా రేటింగ్ ప్రాసెస్ లో లోపాలను సరిదిద్దే పనిమొదలుపెట్టింది. రేటింగ్ ప్రొటోకాల్స్, మీటర్ల నిర్వహణ వంటి పలు అంశాల్లో కీలక మార్పులు చేసింది. బార్క్ బోర్డు, టెక్నికల్ కమిటీల్లో ఇండిపెండెంట్ సభ్యులను తీసుకుంది. ఎప్పటికీ పనిచేసేలా ఓవర్ సైట్ కమిటీని ఏర్పాటు చేసింది. బార్క్ డేటా యాక్సెస్ నిబంధనల్లో మార్పులు చేసి, కట్టుదిట్టం చేశామని బార్క్ చెప్పింది. ఈ మార్పులు చేశాక డేటా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సమాచార శాఖకు తెలిపింది. దీంతో ఇక నుంచి రేటింగ్స్ విడుదల చేయొచ్చని ఎంఐబీ చెప్పింది. దీంతో పాటే నెలవారీగా గత మూడు నెలల రేటింగ్ డేటా కూడా ఇవ్వాలని సూచించింది. కొత్త విధానం ప్రకారం న్యూస్ రేటింగ్స్ ను నాలుగు వారాల సగటు ఆధారంగా ఇవ్వాల్సి ఉంటుందని బార్క్ వర్గాలు 
చెబుతున్నాయి. 
15 నెలలుగా ఆగిన రేటింగ్స్
రెండేళ్ల కింద ముంబయిలో ప్రముఖ ఇంగ్లిష్ వార్తా చానెళ్లు రేటింగ్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ వివాదంలో రేటింగ్ సంస్థ బార్క్ సీఈవో పాత్ర కూడా ఉన్నట్లుగా కేసు నమోదు కావడంతో కొంతకాలం పాటు చానెళ్ల రేటింగ్స్ నిలిపేయాలని బార్క్ నిర్ణయించింది. మొదట 2020 అక్టోబర్ నుంచి 12 వారాల పాటు రేటింగ్స్ ను సస్పెండ్ చేసింది. తర్వాత దీన్ని కొనసాగిస్తూ వచ్చింది. చానెళ్లకు కమర్షియల్ ప్రకటనలకు రేటింగ్సే ప్రమాణంగా తీసుకుంటారు. దీంతో రేటింగ్స్ ఆగడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని న్యూస్ చానెళ్ల ప్రతినిధులు కేంద్రం దృష్టికి తెచ్చారు. లోపాలు సరిదిద్ది రేటింగ్స్​ మళ్లీ ఇవ్వాలని కేంద్ర సమాచార ప్రసార శాఖను న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ పలుమార్లు కోరింది. అయితే పూర్తిస్థాయిలో వ్యవస్థను మార్చే వరకు రేటింగ్స్ ఇవ్వొద్దని కేంద్రం చెప్పింది. ఇప్పుడు అన్ని మార్పులు చేశామని బార్క్ చెప్పడంతో రేటింగ్స్ విడుదలకు అడ్డంకులు పోయాయి.