ఫార్ములా ఈ రేసులో రిజర్వు బ్యాంకు అనుమతులు లేకుండా ఎలా చెల్లింపులు చేశారు

ఫార్ములా ఈ రేసు కేసులో మంగళవారం (31 డిసెంబర్ 2024) హైకోర్టులో వాదనలు వాడీవేడిగా జరిగాయి. ఫార్ములా ఈ వ్యవహారంలో రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా నిధులు ఎలా చెల్లింపు చేశారని ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. రిజర్వ్​ బ్యాంకు అనుమతి లేకుండా ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​ (ఐఓబీ) ద్వారా నేరుగా విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లింపులు కూడా చట్ట వ్యతిరేకమని ఏజీ సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. 

విదేశీ సంస్థకు నగదు చెల్లించిన ఫలితంగా ఇన్‌‌‌‌‌‌‌‌కంట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కింద రూ.14  కోట్లు అదనపు భారం పడిందని చెప్పారు. ఫార్ములా– ఈ రేసింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనమేమీ లేదని, స్పాన్సరర్‌‌‌‌‌‌‌‌కే లాభాలు వచ్చాయని చెప్పారు. నిందితుల జాబితాలో ఫార్ములా –ఈ సంస్థను ఎందుకు చేర్చలేదని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ ప్రశ్నించడం ద్వారా కేసు నుంచి ఏదో విధంగా తప్పించుకునే తపన కనబడుతున్నదని అన్నారు.

ఫార్ములా– ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు చెందినదని, అన్ని అంశాలను పరిశీలించాకే కేసు నమోదు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని, ఈ క్రమంలోనే ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదులో జాప్యం జరిగిందని తెలిపారు.  దర్యాప్తులో తేలిన సమాచారం ఆధారంగా కొత్తగా నిందితులను చేర్చడం, అవసరమైతే ఉన్న వాళ్లను తొలగింపునకు వీలుంటుందని చెప్పారు. రాజకీయ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలతో కేసు నమోదు చేశామనే వాదనలో పస లేదని చెప్పారు. 

అధికారుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీ ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసిందనే వాదనను ఏజీ తోసిపుచ్చారు. ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిగిందని, అక్టోబర్​ 18న దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిందని వెల్లడించారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌పై విచారణ చేపట్టేందుకు డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 17న గవర్నర్‌‌‌‌‌‌‌‌ నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ కూడా పొందినట్లు చెప్పారు. కేసు ప్రాథమిక దర్యాప్తు కూడా ప్రారంభించకుండానే కేసును క్వాష్‌‌‌‌‌‌‌‌ చేయాలని పిటిషన్​ వేయడానికి వీల్లేదని, ఈ మేరకు సుప్రీం కోర్టు పలు తీర్పులు చెప్పిందని గుర్తు చేశారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు  కేసును కొట్టివేయాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ కోరడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేసుకోవాలని అన్నారు.