వన్డే సిరీస్ మనదే.. మంధాన మెరిసింది..సిరీస్ చిక్కింది

  • 8వ సెంచరీతో స్మృతి రికార్డు..  మూడో వన్డేలో ఇండియా గెలుపు
  • 6 వికెట్ల తేడాతో ఓడిన కివీస్‌‌
  • 2- 1తో సిరీస్‌‌ నెగ్గిన టీమిండియా

అహ్మదాబాద్‌‌: తొలి రెండు వన్డేల్లో ఫెయిలైన తర్వాత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (122 బాల్స్‌‌లో 10 ఫోర్లతో 100) తన ఎనిమిదో సెంచరీతో అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్ (63 బాల్స్‌‌లో 6 ఫోర్లతో 59 నాటౌట్‌‌) కూడా ఫిఫ్టీతో మెరవడంతో  న్యూజిలాండ్‌‌తో మూడో వన్డేలో 6  వికెట్ల తేడాతో  ఇండియా విమెన్స్ టీమ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. దాంతో  మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–1తో సొంతం చేసుకుంది. 

మంగళవారం జరిగిన ఈ పోరులో  తొలుత న్యూజిలాండ్‌‌ 49.5 ఓవర్లలో 232 రన్స్‌‌కు ఆలౌటైంది.  మిడిలార్డర్ బ్యాటర్‌‌‌‌ బ్రూక్‌‌ హలీడే (96 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86) సత్తా చాటింది. ఓ దశలో 88/5తో కష్టాల్లో పడ్డ జట్టుకు మంచి స్కోరు అందించింది.  

ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (39), ఇజాబెల్లా గేజ్ (25), లియా తహుహు (24 నాటౌట్‌‌) కూడా రాణించారు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ (3/39) మూడు, ప్రియా మిశ్రా (2/41) రెండు వికెట్లు పడగొట్టగా.. రేణుకా సింగ్‌‌, సైమా ఠాకూర్‌‌‌‌ చెరో వికెట్‌‌ తీశారు. అనంతరం మంధాన, హర్మన్‌‌ మెరుపులతో ఇండియా 44.2 ఓవర్లలోనే 236/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. మంధానకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌,   దీప్తి శర్మకు ప్లేయర్‌‌‌‌ ఆఫ్ ద సిరీస్‌‌ అవార్డులు లభించాయి. 

బౌలర్ల జోరు.. బ్రూక్‌‌ పోరాటం

ఎలాగైనా సిరీస్ నెగ్గాలని పట్టుదల చూపెట్టిన ఇండియా బౌలింగ్‌‌లో  సత్తా చాటింది. ఫీల్డింగ్‌‌లో కూడా అదరగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేసింది.  అటువైపు టాపార్డర్ నిరాశపరిచిన వేళ బ్రూక్‌‌ అద్భుతంగా ఆడింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన కివీస్‌‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సుజీ బేట్స్‌‌ (4)ను ఏడో ఓవర్లో జెమీమా, కీపర్ యస్తికా మంచి సమన్వయంతో రనౌట్ చేశారు.

 సైమా ఠాకూర్‌‌‌‌ వేసిన తర్వాతి ఓవర్లోనే వన్‌‌డౌన్ బ్యాటర్‌‌‌‌ లారెన్ డౌన్‌‌ (1) కీపర్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.  కాసేపటికే  సూపర్ ఫామ్‌‌లో ఉన్న కెప్టెన్‌‌ సోఫీ డివైన్‌‌ (9)ను అద్భుతమైన గూగ్లీతో  బౌల్డ్ చేసిన ప్రియా మిశ్రా కివీస్‌‌ను దెబ్బకొట్టింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న ప్లిమ్మర్‌‌‌‌, బ్రూక్ హలీడేతో కలిసి ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ, 19వ ఓవర్లో మంచి టర్న్‌‌, బౌన్స్‌‌తో ప్లిమ్మర్‌‌‌‌ను పెవిలియన్ చేర్చిన ప్రియా న్యూజిలాండ్‌‌కు మరో షాకిచ్చింది.

ఆపై, బ్రూక్‌‌తో సమన్వయలోపంతో  మాడీ గ్రీన్ (15) రనౌటవడంతో  88 రన్స్‌‌కే సగం వికెట్లు కోల్పోయిన కివీస్ డీలా పడింది. కానీ, మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడిన బ్రూక్‌‌ కీలక భాగస్వామ్యాలతో  ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దింది. గేజ్‌‌తో ఆరో వికెట్‌‌కు 64 రన్స్‌‌, హనా రోవ్ (11)తో ఏడో వికెట్‌‌కు 47 రన్స్‌‌ జోడించింది. గేజ్‌‌, రోవ్‌‌తో పాటు సెంచరీ దిశగా దూసుకెళ్తున్న బ్రూక్‌‌ను స్పిన్నర్‌‌‌‌ దీప్తి పెవిలియన్ చేర్చింది. చివర్లో తహుహు మెరుపులతో కివీస్ ఆ మాత్రం స్కోరు చేసింది. 

మంధాన ధనాధన్‌‌

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇండియాకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్‌‌‌‌ షెఫాలీ వర్మ (12) మళ్లీ నిరాశపరిచింది. నాలుగో ఓవర్లోనే రోవ్‌‌ బౌలింగ్‌‌లో కీపర్‌‌‌‌ క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగింది. అయితే గత రెండు ఇన్నింగ్స్‌‌ల్లో 5,0 స్కోర్లతో విఫలమైన మంధాన ఈసారి అద్భుతంగా ఆడింది. వన్‌‌డౌన్ బ్యాటర్‌‌‌‌  యస్తికా భాటియా (35)తో కలిసి రెండో వికెట్‌‌కు 76 రన్స్‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టింది. 

ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను ఆడే క్రమంలో సోఫీ డివైన్‌‌ కు రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇచ్చి భాటియా ఔటైనా.. మంధాన వెనక్కుతగ్గలేదు. తహుహు బౌలింగ్‌‌లో ఫోర్‌‌‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఆమె స్కోరు వంద దాటించింది. తనకు కెప్టెన్‌‌ హర్మన్‌‌ నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఇద్దరూ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టారు. టార్గెట్‌‌కు చేరువైన సమయంలో ఇద్దరూ మరింత స్పీడు పెంచారు. 

డివైన్ వేసిన 37వ ఓవర్లో కౌర్ ఓ ఫోర్ కొడితే మంధాన వరుసగా రెండు ఫోర్లతో 90లోకి వచ్చింది. రోవ్‌‌ బౌలింగ్‌‌లో బౌండ్రీతో స్కోరు 200 దాటించిన ఆమె  కార్సెన్ వేసిన 40వ ఓవర్లో సింగిల్‌‌తో సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ వెంటనే మంధానను రోవ్ బౌల్డ్ చేయడంతో  మూడో వికెట్‌‌కు 117  రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌ షిప్‌‌ బ్రేక్ అయింది. అప్పటికే మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చేయగా.. జెమీమా (22)తో కలిసి హర్మన్‌‌ లాంఛనం పూర్తి చేసింది. డివైన్‌‌ బౌలింగ్‌‌లో విన్నింగ్‌‌ ఫోర్ కొట్టింది. 

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌: 49.5 ఓవర్లలో 232 ఆలౌట్‌‌ (హలీడే 86, ప్లిమ్మర్ 39, దీప్తి శర్మ 3/39)
ఇండియా: 44.2 ఓవర్లలో 236/4 (మంధాన 100, హర్మన్‌‌ 59*, రోవ్ 2/47)

8 వన్డేల్లో స్మృతి మంధానకు ఇది ఎనిమిదో సెంచరీ. ఈ ఫార్మాట్‌‌లో ఎక్కువ సెంచరీలు చేసిన ఇండియా బ్యాటర్‌‌‌‌గా మిథాలీ రాజ్‌‌ రికార్డును బ్రేక్ చేసింది. మిథాలీ 7 సెంచరీలు చేయగా.. హర్మన్‌‌ 6 సెంచరీలతో మూడో ప్లేస్‌‌లో ఉంది.