- 62 ఏండ్ల తర్వాత ఒకేసారి ముంబై, ఢిల్లీకి మాన్సూన్
- డ్రైనేజీలో పడి ముంబైలో ఇద్దరు మృతి
- అప్రమత్తమైన ప్రభుత్వం.. అధికారులతో సీఎం రివ్యూ
- ఢిల్లీలో కరెంట్ షాక్‌తో మహిళ దుర్మరణం
- కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర మొత్తం రుతుపవనాలు వ్యాపించాయి. ప్రధానంగా ముంబైని వానలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. కాగా, 62ఏండ్ల తర్వాత ముంబై, ఢిల్లీని ఒకేసారి రుతుపవనాలు తాకాయి. ఢిల్లీని రుతుపవనాలు రెండు రోజుల ముందే తాకగా, ముంబైకి మాత్రం రెండు వారాలు ఆలస్యంగా వచ్చాయి.
ముంబైలో లోతట్టు ప్రాంతాలు జలమయం
ముంబైలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెంబూర్ (8 సెంటీ మీటర్లు), విఖ్రోలి (7.9 సెం.మీ), సియోన్ (6.2 సెం.మీ), ఘాట్కోపర్(6.1 సెం.మీ), మతుంగ (6.1 సెం.మీ)లో కుండపోత వాన పడింది. 11 చెట్లు పడిపోయాయని, ఏడు షార్ట్ సర్క్యూట్ ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. గోవండిలో ఇద్దరు డ్రైనేజీలో కొట్టుకుపోయారు. ఠానేలోని ఘోడ్బండర్ రోడ్లో ఉన్న ఓ రెస్టారెంట్‌పై కప్పు కూలడంతో ముగ్గురు గాయపడ్డారు. సిటీ మొత్తంలో సగటున సుమారు 11 సెం.మీ వర్షపాతం నమోదైందని శాంతాక్రూజ్ వెదర్ స్టేషన్ ప్రకటించింది. కాగా, ఢిల్లీ రైల్వేస్టేషన్లో 34 ఏండ్ల సాక్షి ఆహుజా ఆదివారం కరెంట్ షాక్‌తో చనిపోయింది. సాక్షి ఆహుజా చండీగఢ్ ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చింది. నీటి గుంతలు దాటే క్రమంలో ఎలక్ట్రిసిటీ పోల్‌ను పట్టుకుంది. వర్షాల కారణంగా తెగిపడిన కరెంట్ వైర్లు ఆమెకు తగిలాయి. ఈ క్రమంలో షాక్‌కు గురై చనిపోయింది.
మరో మూడు రోజుల్లో దేశమంతటా మాన్సూన్
హర్యానా, చండీగఢ్‌లోనూ రుతుపవనాలు యాక్టివ్‌గా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానాలో కొంత భాగం, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్‌ని మాన్సూన్ తాకిందని వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో దేశమంతటా రుతుపవనాలు వ్యాపిస్తాయని ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం సాయంత్రం నాటికి సుమారు 8 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డయ్యిందని దన్సా వెదర్ స్టేషన్ ప్రకటించింది.
