ZIM vs AFG: అంపైర్‌ను అవమానించేలా చర్యలు.. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్‌కు షాకిచ్చిన ఐసీసీ

ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ గుల్బదిన్ నయీబ్‌పై ఐసీసీ కొరడా ఝుళిపించింది. శుక్రవారం (డిసెంబర్ 13) హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అంపైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకుగానూ నయీబ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శనివారం ప్రకటన విడుదల చేసింది.

గుల్బదిన్ నయీబ్‌ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1ను ఉల్లంఘించినట్లు ఐసీసీ ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్‌ చేసిన తప్పును అంగీకరించినట్లు వెల్లడించింది. నేరాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని తెలిపింది. ఆటగాళ్లు లెవల్ 1 నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఐసీసీ.. సదరు ఆటగాడి మ్యాచ్ ఫీజులో గరిష్టంగా 50 శాతం జరిమానా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విదిస్తుంది.

అసలేం జరిగింది..?

జింబాబ్వే ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రషీద్ ఖాన్ బౌలింగ్‍లో తషింగా ముసెకివాపై లెగ్ బిఫోర్ వికెట్ అప్పీల్‌(ఎల్బీడబ్ల్యూ) కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఆ సమయంలో గుల్బదిన్ మ్యాచ్‌లో DRS అందుబాటులో లేనప్పటికీ, సమీక్ష కోసం విజ్ఞప్తి చేసాడు. ఇది అంపైర్ల నిర్ణయాలను అవమానించేలా ఉండటంతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. 

ALSO READ | ఘనంగా పీవీ సింధు నిశ్చితార్థం

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 50 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.