55 గంటల 13 నిమిషాల్లో అడ్వెంచరస్​ జర్నీ..

55 గంటల 13 నిమిషాల్లో అడ్వెంచరస్​ జర్నీ..

మనాలి టు లడఖ్​... దాదాపుగా నాలుగొందల ముప్పై కిలోమీటర్లు. రోడ్డు పొడవునా రాళ్లు, గుంతలు, నీళ్లు. లోయలు, మలుపులు. ఇంతటి అడ్వెంచరస్​ జర్నీని కేవలం 55 గంటల 13 నిమిషాల్లో పూర్తి చేసింది ప్రీతి మస్క. అది కూడా సైకిల్​పై 45 ఏండ్ల వయసులో. ఈ ఫీట్​తో గిన్నిస్​ వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సాధించింది. అలాగని ఈమె ప్రొఫెషనల్​ సైక్లిస్ట్​ కాదు. 40 ఏండ్ల వయసులో తనకి ఎదురైన హెల్త్​ ఇష్యూలకి ట్రీట్మెంట్​గా సైకిల్​ ఎక్కిందామె. పూణేలో పుట్టి, పెరిగిన ప్రీతికి చిన్నప్పట్నించీ ఆటలంటే ఇష్టం. స్కూల్లో చదువుకునే రోజుల్లో నేషనల్​ హాకీ, బాస్కెట్​ బాల్​ ప్లేయర్​గా ఎన్నో మెడల్స్​ అందుకుంది. పెద్దవుతున్న కొద్దీ చదువులో పడి.. ఆటల్ని పక్కనపెట్టింది. ఆ తర్వాత ఉద్యోగం, పెండ్లి, ఇద్దరు పిల్లల బాధ్యతతో ఆటల ఊసే మర్చిపోయింది. పని ఒత్తిడితో  తనని తాను పట్టించుకోలేదు కూడా. దాంతో 40 ఏండ్ల వయసులో ఎనీమియా, హార్మోనల్​ ఇంబాలెన్స్​, పీసీఓఎస్​ లాంటి సమస్యలొచ్చాయి ఆమెకి. 

ఆ ఎంకరేజ్​మెంట్​తో

ఆ సమస్యలకి ట్రీట్మెంట్​ తీసుకుంటున్న టైంలోనే.. ఆమె కొడుకు చదువుకుంటున్న స్కూల్లో పేరెంట్స్​ కోసం ఒక రన్నింగ్​ కాంపిటీషన్​ పెట్టారు. ఆ పోటీలో ప్రీతి స్పీడ్​ చూసి,  ఆ స్కూల్​  కోచ్​ సైక్లింగ్​, స్విమ్మింగ్​, రన్నింగ్ పోటీలు జరిగే ​ ఎండ్యూరో అబ్​స్టకిల్​ రేసు గురించి చెప్పాడు. నలభైల్లో ఇదంతా నావల్ల కాదనుకుంది మొదట్లో ప్రీతి. కానీ, ఆ కోచ్​ ఇచ్చిన ఎంకరేజ్​మెంట్​తో సైకిల్​ ఎక్కింది. ఆ  కాంపిటీషన్​ గెలిచింది.  ఆ ప్రాసెస్​లో హెల్త్ ఇష్యూస్​​  తగ్గిపోయాయి. ఇంట్లో వంటగది​ నుంచి హాల్​లో​కి నడిస్తేనే  ఆయాస పడే ఆమె  బాగా యాక్టివ్​ అయింది. పైగా తనలో పాజిటివిటీ పెరిగింది. దాంతో మరిన్ని ఈవెంట్స్​లో పార్టిసిపేట్ చేయాలనుకుంది.  '

మనాలి నుంచి లడఖ్

ఆ ప్రయత్నంలోనే ముప్పైకి పైగా హాఫ్​ మారథాన్స్​, నాలుగు ఫుల్​ మారథాన్స్​ గెలిచింది. రెండు అల్ట్రా మారథాన్స్​ని గెలిచేసింది. ఆ ఇన్​స్పిరేషన్​తో 2019 లో 17 రోజుల్లో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మొత్తం 3,773 కిలోమీటర్లు గ్రూప్​తో కలిసి సైక్లింగ్ చేసింది. అందుకు మొదటిసారి గ్రూపు గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​కి ఎక్కింది. ఆ తర్వాత 2021లో 24 రోజుల్లో 6, 000 కిలోమీటర్లు సైకిల్​పై చుట్టేసింది. ఆ వెంటనే నాసిక్​ నుంచి అమృత్​సర్​కు  సైక్లింగ్​ చేసి ‘సూపర్​ రాండన్యూర్’​ టైటిల్​ అందుకున్న మొదటి మహిళగా నిలిచింది. ఆ తర్వాత  ఒంటరిగా మనాలి నుంచి లడఖ్​ వెళ్లాలని డిసైడ్​ అయింది. ఈ జర్నీ కోసం చాలా గతుకు రోడ్లలో గంటల తరబడి ప్రాక్టీస్​ చేసింది. మానసికంగా తనని తాను సిద్ధం చేసుకుంది. ఈ జర్నీలో ఆమెకి మంచినీళ్లు, చాయ్​, జ్యూస్​లు ఇచ్చేందుకు ప్రతి స్టాప్​ దగ్గర ఒకరు ఉన్నారు. అలా  అందరి సపోర్ట్​తో 55 గంటల 13 నిమిషాల్లోనే టార్గెట్​ని చేరుకుంది. వీటన్నింటితో పాటు సైకిల్ మాడిఫికేషన్​​ , అడ్వెంచర్​ కంపెనీలని మొదలుపెట్టింది. 

“ పెండ్లి, పిల్లల తర్వాత  ఆడవాళ్లు తమ గురించి తాము ఆలోచించుకోవడం మర్చిపోతారు. తమ కలలకి అడ్డంకిగా వయసుని చూస్తారు. కానీ, నిజానికి వయసు ఒక నెంబర్​ మాత్రమే. దాన్ని దాటి చూస్తేనే జీవితం . నేను నలభైల్లో సైక్లింగ్​  మొదలుపెట్టా.  ఎన్నో దెబ్బలు తగిలాయి. అలాగని ప్రయత్నం ఆపలేదు. నాతో నేను పోటీపడుతూ ఈరోజు ఈ అడ్వెంచర్​ జర్నీ పూర్తి చేశా. నాలాంటి కలలున్న ఆడవాళ్లు ఒక్క అడుగు ముందుకేస్తే సొసైటీ, ఫ్యామిలీ ఆటోమెటిక్​గా సపోర్ట్​ చేస్తుంది” అంది ప్రీతి.