యాదాద్రిలో మళ్లీ కృత్రిమ పాల కలకలం.. రసాయనాలు కలిపి పాలు తయారీ

యాదాద్రిలో మళ్లీ కృత్రిమ పాల కలకలం.. రసాయనాలు కలిపి పాలు తయారీ
  • రసాయనాలు కలిపి పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌
  • పోలీసులు కేసులు పెడుతున్నా ఆగని దందా

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో మరోసారి కృత్రిమ పాల తయారీ కలకలం సృష్టించింది. అక్రమదందాకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేసి హోటళ్లు, స్వీట్‌‌‌‌‌‌‌‌ షాపులకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఫుడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ ఆఫీసర్లు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా దందా మాత్రం ఆగడం లేదు. గత వారంలో పోచంపల్లి కృత్రిమ పాలను స్వాధీనం చేసుకోగా.. తాజాగా భువనగిరిలో ఇలాంటి దందానే బయటపడింది. 

రసాయనాలు కలుపుతూ..
యాదాద్రి జిల్లా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను ఆనుకొని ఉండడం, నగరంలో పాలకు భారీ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో భూదాన్‌‌‌‌‌‌‌‌పోచంపల్లి, చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్‌‌‌‌‌‌‌‌ మండలాలకు చెందిన పలువురు కృత్రిమంగా పాలను తయారు చేస్తున్నారు. ఒక్క గేదె గానీ.. ఆవు గానీ లేకున్నా వేలాది లీటర్ల పాలు అమ్ముతున్నారు. పాడి రైతుల వద్ద కొద్ది మొత్తంలో పాలు కొని అందులో పాల పౌడర్‌‌‌‌‌‌‌‌, హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ పెరాక్సైడ్, ఎసిటిక్‌‌‌‌‌‌‌‌ యాసిడ్, ఆక్సిటోసిన్‌‌‌‌‌‌‌‌, స్టార్చ్‌‌‌‌‌‌‌‌, బేకింగ్‌‌‌‌‌‌‌‌ సోడా, వంట నూనె కలిపి వందల లీటర్ల పాలు తయారు చేస్తున్నారు. ఇలా తయారైన పాలు చిక్కగా ఉండడంతో పాటు ఫ్యాట్‌‌‌‌‌‌‌‌ కూడా ఎక్కువగా వస్తుండడంతో స్వీట్స్‌‌‌‌‌‌‌‌ తయారీ కోసం వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

భువనగిరిలో ఒకరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌
కృత్రిమ పాలను తయారు చేస్తున్న ఓ వ్యక్తిని గురువారం భువనగిరి రూరల్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. రూరల్‌‌‌‌‌‌‌‌ మండలంలోని మన్నెవారిపంపు గ్రామానికి చెందిన సామల సత్తిరెడ్డి కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గురువారం అతడి ఇంటిపై దాడి చేసి 80 లీటర్ల కృత్రిమ పాలు, వాటి తయారీకి ఉపయోగించే ధోల్పూర్‌‌‌‌‌‌‌‌ ఫ్రెష్‌‌‌‌‌‌‌‌ స్కిమ్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్ పౌడర్ పాకెట్లు, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఎసిటిక్‌‌‌‌‌‌‌‌ యాసిడ్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.