కొలాం గిరిజనులను ఆదుకోవాలి

ఆదిలాబాద్, వెలుగు: అటవీ సంపద ఆధారంగా జీవిస్తున్న కొలాం గిరిజనులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ కొలాం సేవా సంఘం నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సోనేరావు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ రూరల్ అటవీ ప్రాంతంలోకి ఆదివాసీలు వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, ఇటీవల ఓ ఆదివాసీ మహిళపై దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. 

అడవిలోని ఇప్ప పువ్వు, తేనె, వెదురు, తునికాకు సేకరిస్తామని, ప్రభుత్వం వీటి ఎగుమతికి అనుమతించి ఉపాధి కల్పించాలని కోరారు. అడవులు నరికివేస్తున్నారంటూ అధికారులు తమపై తప్పుడు ప్రచారం చేసి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సంఘ నాయకులు జంగు పటేల్, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.