ఏపీ కొత్త చీఫ్ సెక్రెటరీగా ఆదిత్యనాథ్ దాస్

ఏపీ కొత్త చీఫ్ సెక్రెటరీగా ఆదిత్యనాథ్ దాస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీగా  ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన నీలం సాహ్ని పదవీ కాలం డిసెంబర్ 31తో ముగుస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె స్థానంలో కొత్త సీఎస్ గా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. సీఎస్ గా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన ఆదిత్యనాథ్ దాస్ మధ్యాహ్నం ముందుగా సీఎం జగన్ ను కలిశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ తో కలసి ముఖ్యమంత్రి జగన్ ను కలసిన అనంతరం  సచివాలయం మొదటి బ్లాక్ లో  ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి వరకు  సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని పదవీకాలం డిసెంబర్ 31తో ముగియడంతో ఆమెను సీఎం జగన్ కు ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమించారు. దీంతో ఆమె పదవీ విరమణ చేసినా.. సీఎం జగన్ కు ప్రిన్సిపల్ అడ్వైజర్ గా  నీలం సాహ్ని విధులు నిర్వహిస్తారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ తనకు అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ అజెండానే తమ అజెండాగా ఉంటుందని.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకే అధికారులందరితో కలసి పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ఆదిత్యనాథ్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు.