ఆరోగ్య పాఠశాలకు శ్రీకారం

  • రాష్ట్రంలోనే మొదటిసారి ఆదిలాబాద్​ జిల్లాలో ప్రారంభం
  • నెల రోజుల పాటు ఒక్కో అంశంపై అవగాహన
  • విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేయడం.. ఆరోగ్యం.. మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తాంసి జడ్పీ హైస్కూల్​లో చాచా నెహ్రూ ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా ఉండడం, వారిలో ఆత్మ విశ్వాసం నింపడం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా..

విద్యార్థుల ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించి రాష్ట్రంలోనే మొదటిసారి ఆదిలాబాద్​జిల్లాలో ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో వారం ఒక్కో అంశాన్ని అమలు చేస్తామని, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన,  ఒత్తిడి నివారించుకునే మార్గాలు, డ్రగ్స్​కు దూరంగా ఉండడం, వ్యాధుల నివారణ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 

అన్ని స్కూళ్లతో పాటు ఇంటర్ కాలేజీల్లోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. స్టూడెంట్లు మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మద్యం, పొగాకుతోపాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. నాలుగు వారాల అనంతరం నిరంతరం కార్యక్రమం కొనసాగేలా హెచ్​ఎంలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఒక్కో వారం ఒక్కో అంశం..

నాలుగు వారాల పాటు నిర్వహించే ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.  ప్రతి రోజు ఉదయం ప్రార్థన అనంతరం టీచర్లతో పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి వారం ఒక్కో అంశంపై అవగాహన కల్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హైస్కూళ్లు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లతో పాటు, గవర్నమెంట్ కాలేజీల్లో కార్యక్రమం ఉంటుంది.

 ప్రతి సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత, మంగళవారం పోషకాహారంపై అవగాహన, బుధవారం ఒత్తిడి నివారించుకునే మార్గాలు, గురువారం డ్రగ్స్ కు దూరంగా ఉండడం, శుక్రవారం వ్యాధుల నివారణ, శనివారం వ్యక్తిత్వ వికాసం అంశాల గురించి విద్యార్థులకు వివరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు.