
ఆషాఢ మాసం వెళ్లిపోయింది. ఇక శ్రావణమాసం వచ్చేసింది. కానీ ఈ ఏడాది (2023) రెండు శ్రావణమాసాలు రావటం విశేషం. అలా ఈరోజు నుంచి అధిక శ్రావణం ప్రారంభమైంది. ఈ అధిక శ్రావణంలో చేయకూడని పనులు ఉన్నాయని మరి ముఖ్యంగా శుభకార్యాలు వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఈనెల జూలై 18వ తారీకు నుంచి శ్రావణమాసం ప్రారంభం అయింది. అయుతే ఈ శ్రావణమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు వచ్చిన శ్రావణ మాసం అధిక మాసం అన్నమాట. అందుకే దీనిని అధిక శ్రావణ మాసం అంటారు. 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం ఇది. ఈ మాసం నేటి(జూలై 18) నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. అయితే ఈ అధిక మాసం అనేది కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధిక మాసం రాదు. ఐతే ముందుగా ఈ అధిక మాసం వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అసలు అధికమాసం ఎందుకు వస్తుంది?.
పండితులు చెప్పినదానికి బట్టి... తెలుగు పంచాంగం ప్రకారం.. (ఇంగ్లీషుల నెలల ప్రకారంగా చూస్తే) శ్రావణమాసం జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణమాసం ఉంటుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ మాసంలో శివయ్యకు పూజలు చేస్తే మంచి శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మూడేళ్ల తరువాత అదనపు నెల వస్తుంది. దీనినే అధికమాసం లేదా శూన్య మాసం అని కూడా అంటారు. అలా ఈ అధిక శ్రావణం ఆగస్ట్ 16 వరకూ ఉంటుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాల తర్వాత అదనపు నెల జోడించబడుతుంది. దీనిని అధికమాసం లేదా శూన్య మాసం అని అంటారు. ఇలా రావడానికి కారణం క్యాలెండర్ లెక్కింపులో ఉన్న తేడాలే. సౌరమానం ప్రకారం కాలాన్ని లెక్కిస్తే ఏడాదికి 365 రోజుల 6 గంటలు ఉంటాయి. అదే చంద్రమానం ప్రకారమైతే ఏడాదికి 354 రోజులే ఉంటాయి. వీరిద్దరి మధ్య దాదాపు 11 రోజుల గ్యాప్ ఉంది. ఏడాది లెక్కింపులో ఉండే తేడాలను సరిచేయడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెల అదనంగా జోడించి ఇలా అధికమాసం రూపంలో సరి చేస్తుంటారు. దీనినే లీపు మాసం అంటారు.
రెండు అమావాస్యల మధ్య రవి సంక్రమణం జరగని నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న కాల భేదాన్ని సరిచేయడానికి అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది. చాంద్రమానంలో ఒకనెలను అధికంగా కలిపి అధికమాసంగా పరిగణిస్తారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం. దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 354 రోజులు వస్తాయి. ఈ ప్రకారం చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరం కన్నా 11 రోజుల, 1 గంటా 31 నిమిషాల 12 సెకండ్లు తక్కువగా ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ ముప్పయి రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒక నెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.
కాబట్టి ఈ శూన్యమాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దని అసలు శుభకార్యలు తలపెట్టవద్దని సూచిస్తున్నారు. అధిక శ్రావణ మాసంలో శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతుంటారు. జులై 18 నుంచి ఆగస్ట్ 16 వరకూ అధిక శ్రావణ మాసం రోజుల్లో చేయకూడని పనులేమిటో తెలుసుకుందాం..
* వివాహాలు చేసుకోకూడదు
* కొత్త షాపుల ప్రారంభోత్సవాల చేయకూడదు
* -కొత్త ప్రాజెక్ట్లు, కొత్తగా ఉద్యోగాల్లో చేరడం, భారీ పెట్టుబడులను పెట్టడం చేయొద్దు..
* -కొత్త ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు అంటూ భూమి పూజలు చేయవద్దు.
* ఆస్తుల కొనుగోళ్లు చేయవద్దు
* -ఉపనయనం వంటి శుభ కార్యాలు చేయవద్దు
కాని ఈ నెలలో తప్పనిసరిగా చేయాల్సిన పితృకార్యాలు మాత్రం చేయవచ్చని, ఆర్ధికం లాంటివి మానకుండా బ్రాహ్మణుడికి సమర్పించవచ్చని పండితులు సూచిస్తున్నారు. అధిక మాసం కాబట్టి ఈ నెలలో చేసే ఏ పూజ అయినా అధిక ఫలితం లభిస్తుందని వేదాంతుల అభిప్రాయం. అందుకే ఆలయాలను ఇందుకు సిద్ధం చేశారు. గుడుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక మాసం అయినా భక్తులు వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. అధికంగా వచ్చే శ్రావణ మాసం మహావిష్ణువుకు ఇష్టమైనదిగా చెబుతున్నారు. ఈ మాసంలో విష్ణు సహస్రనామాలు పఠించడం, పితృఆరాధన, దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల విశేష ఫలితాన్నిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా అనాథలకు, మూగజీవాలకు ఆహారాన్ని అందించడం వల్ల శుభ పలితాలు కలుగుతాయని చెబుతున్నారు.