మెదక్ జిల్లాలో రూ.18.19 కోట్లతో అదనపు ట్రాన్స్​ఫార్మర్లు

  • మెదక్ జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ శంకర్  

మెదక్, వెలుగు: రాబోయే రోజుల్లో అంతరాయం లేకుండా, మెరుగైన విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో రూ.18.19 కోట్ల వ్యయంతో అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు ట్రాన్స్ కో ఎస్ఈ శంకర్ తెలిపారు. గురువారం టెక్నికల్ డీఈ  శ్రీనివాస్ విజయ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. పవర్ ట్రాన్స్​ఫార్మర్స్, అడిషనల్​ ట్రాన్స్ ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్స్, 33/ 11 కేవీ  లైన్స్ ఇంప్రూమెంట్ పనులు చేయడానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆయా పనులు చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. 

జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 3,52,386 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్టు తెలిపారు.  గృహ జ్యోతి పథకంలో భాగంగా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్​ వినియోగిస్తున్న 1,25,939 మంది వినియోగదారులకు రూ.31.36  కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. 3,350 మంది నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.3.22 కోట్లు సబ్సిడీ అందించామన్నారు. రూ.లక్షా 3 వేల 519 వ్యవసాయ కనెక్షన్లకు రూ.92. 72 కోట్లు, 19,765 మంది ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్లలోపు విద్యుత్​ వినియోగించే వారికి సబ్సిడీ ఇచ్చినట్టు తెలిపారు.

 జిల్లాలో 8 కొత్త సబ్ స్టేషన్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో చల్మెడ, బాలనగర్,  మెదక్ పట్టణం, వెంకటాయపల్లి, చండూర్, మహమ్మద్ నగర్, మిర్జాపల్లి, గొల్లపల్లి ఉన్నాయని వివరించారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మెదక్ విద్యుత్ సర్కిల్ ఆఫీసులో శుక్రవారం విద్యుత్ వినియోగదారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.