సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలి : అడిషనల్ కలెక్టర్ రాంబాబు

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట మున్సిపాలిటీలో సమగ్ర కుటుంబ సర్వే ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఇండ్లకు అతికించిన స్టిక్కర్లను పరిశీలించి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ సర్వేలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.

సర్వేకు సహకరించాలి.. 

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్ కోరారు. సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఎన్యూమరేటర్ల శిక్షణ, మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమగ్ర సర్వేలో మొత్తం56 ప్రశ్నలు,75 ఉప ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. అధికారులు మొదటగా వారికి కేటాయించిన బ్లాక్ ల్లో  ఇండ్ల గణన పూర్తిచేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎండీ రుక్మోద్దీన్, ఎంఈవో శ్రీనివాస్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు