న్యూఢిల్లీ : డీబీ పవర్‌ను కొనుగోలు చేయడానికి అదానీ పవర్ కుదుర్చుకున్న రూ.7,017 కోట్ల విలువైన డీల్ తాత్కాలికంగా ఆగిపోయింది. డీల్ పూర్తి చేయాల్సిన డేట్ బుధవారంతో ఎక్స్‌పైరి అయ్యింది. కిందటేడాది ఆగస్ట్ 18 న ఈ డీల్ కుదుర్చుకున్నారు. డేట్ పొడిగిస్తారా? చర్చలు కొనసాగుతున్నాయా? అనే అంశాలపై అదానీ పవర్ స్పందించలేదు. కాగా, కిందటేడాది డీల్ కుదుర్చుకున్న తర్వాత నాలుగు సార్లు డీల్ క్లోజింగ్ డేట్‌ను పొడిగించారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్ కంపెనీలన్నీ అదనపు ఫండ్స్‌ను సేకరించడంలో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. డీల్ ఎందుకు ఆగిపోయిందనేదానికి అదానీ పవర్ కారణం చెప్పలేదు.
ఇరు కంపెనీలు కిందటేడాది ఆగస్ట్‌లో ఎంఓయూపై సంతకాలు చేశాయి. అక్టోబర్ 31 లోపు డీల్ పూర్తి కావాల్సి ఉండగా, నవంబర్ 30 కి ఒకసారి, డిసెంబర్ 31 కి మరోసారి పొడిగించారు. ఆ తర్వాత జనవరి 15 వరకు, ఫిబ్రవరి 15 వరకు కూడా పెంచారు. బొగ్గు ప్లాంట్లను ఆపరేట్ చేస్తున్న డీబీ పవర్‌కు దేశంలో రెండు 600 మెగావాట్‌ల ప్లాంట్‌లు ఛత్తీస్‌గడ్‌లో ఉన్నాయి.
