అదానీ ఇష్యూపై డీఎల్‌ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్
న్యూఢిల్లీ: ప్రధాని చెప్పడం వలనే అదానీ గ్రూప్‌కు బ్యాంకులు అప్పులిచ్చాయనే ఆరోపణలపై డీఎల్‌ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ మండిపడ్డారు. ఒక వేళ ప్రధాని నుంచి కాల్ వచ్చినా, ఏ బ్యాంక్ కూడా ఇలా లోన్లు ఇవ్వవని అన్నారు. ‘ప్రైమ్ మినిస్టర్‌కు దీంతో సంబంధం (కార్పొరేట్లకు లోన్లు ఇవ్వడం) ఏముంది? ఏ బ్యాంకర్ కూడా, ఒక వేళ ప్రధాని చెప్పినా, అన్ని సరిగ్గా ఉంటే తప్ప లోన్లు ఇవ్వరు’ అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘అదానీ గురించి నాకు తెలియదు. కానీ, ఎవరైనా ఇలా ఆలోచిస్తే మాత్రం వారు మూర్ఖులే’ అని అన్నారు. ఇందుకు ఉదాహారణగా ఐసీఐసీఐ బ్యాంక్ – చందాకొచ్చర్ ఇష్యూని గుర్తు చేశారు. వీడియోకాన్ గ్రూప్‌కు అడ్గగోలుగా అప్పులిచ్చిన చందాకొచ్చర్ ప్రస్తుతం జైళ్ల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. అదానీ– హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వలన దేశంలోకి ఇన్వెస్ట్‌మెంట్లు రావడం ఆగిపోతుందనేది అర్థపర్దం లేనిదని అన్నారు. కానీ, గ్రోత్ పెరగాలంటే అదానీ గ్రూప్ తమ అప్పులను తగ్గించుకోవాలని, క్యాపిటల్‌ను పెంచుకోవాలని సలహాయిచ్చారు. ఇండియా చాలా పెద్ద దేశమని, అదానీ–హిండెన్‌బర్గ్ ఇష్యూ ప్రభావం పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు.
పెద్ద ఇష్యూల ముందు రిపోర్ట్‌లతో..
డీఎల్‌ఎఫ్ గ్రూప్ 15 ఏళ్ల క్రితం ఐపీఓకి రావాలనుకునే ముందు ఇలాంటి రిపోర్ట్‌లే వచ్చాయని సింగ్ గుర్తు చేసుకున్నారు. ‘మీకు నచ్చింది మీరు చేసుకోండి (కెనడియన్ కంపెనీకి) అని అప్పుడు చెప్పాం. పెద్ద షేర్ సేల్ ఉన్నప్పుడు ఇలంటి రిపోర్ట్‌లతో బ్లాక్‌మెయిలర్లు బయటకొస్తున్నారు’ అని అన్నారు. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్‌కు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.20 వేల కోట్ల ఎఫ్‌పీఓ స్టార్టయ్యే ముందు ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. గ్రూప్ షేర్లను షార్ట్ చేశామని ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 125 బిలియన్ డాలర్లు క్రాష్ అయ్యింది.
మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు..
నరేంద్ర మోడీ డైనమిక్ పర్సన్ అని, ఆయన ప్రధానిగా కొనసాగేంత వరకు పెట్టుబడులకు ఇండియా గమ్యస్థానంగా కొనసాగుతుందని సింగ్ అభిప్రాయపడ్డారు. అదానీ–హిండెన్‌బర్గ్ ఇష్యూపై మోడీ స్పందించాల్సిన అవసరం లేదని, ఆయన తన పని తాను చేసుకుంటూ పోవాలని అన్నారు. ‘కుక్కలు మొరుగుతాయి. దానికి ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన పనిలేదు. సిస్టమే వాటిని చూసుకుంటుంది. అవే వెళ్లిపోతాయి. ఆయన తన పని తాను చేసుకుంటూ పోవాలి’ అని సింగ్ అన్నారు. అదానీ గ్రూప్ గురించి మాట్లాడుతూ, ఎంటర్‌ప్రెనూర్లు ఎప్పుడూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండేవారని, ఈక్విటీ, అప్పుల మధ్య బ్యాలెన్స్ ఉండడం తెలివైన పని అని పేర్కొన్నారు. కిందటేడాది సెప్టెంబర్ నాటికి అదానీ గ్రూప్ అప్పులు రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ అప్పులను ఆస్తులతో బ్యాలెన్స్ చేశారు. ‘ప్రస్తుతానికి అదానీ అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆయనకు గుడ్ లక్ చెబుతున్నా. ఆయన తన క్యాపిటల్‌ను స్లోగా నైనా పెంచుకోవాలి’ అని అన్నారు.
