- శుక్రవారం ఒక్క రోజే రూ.3.4 లక్షల కోట్లు
- గత రెండు సెషన్లలో 30 శాతం వరకు క్రాష్ అయిన అదానీ గ్రూప్ షేర్లు
- సంపదలో ఏడో ప్లేస్‌కు గౌతమ్ అదానీ
బిజినెస్ డెస్క్, వెలుగు: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ కంపెనీలను వెంటాడుతున్నాయి. ఈ గ్రూప్‌కు చెందిన తొమ్మిది లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం 25 శాతం వరకు పతనమయ్యాయి. లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 19 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 16 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 6 శాతం మేర క్రాష్ అయ్యాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ , అదానీ విల్‌మార్, అదానీ పవర్ షేర్లు 5 శాతం చొప్పును పడ్డాయి. బుధవారం సెషన్‌లో కూడా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. అంబుజా సిమెంట్ షేర్లు శుక్రవారం ఇంట్రాడేలో 25 శాతం మేర పతనమయ్యాయి. 2006 తర్వాత కంపెనీ షేర్లు ఇంతలా పడడం ఇదే మొదటిసారి. ఏసీసీ షేర్లు కూడా 20 శాతం వరకు పడగా, అదానీ గ్రూప్ తాజాగా టేకోవర్ చేసిన ఎన్‌డీటీవీ షేర్లు 5 శాతం నష్టపోయాయి. కాగా, అదానీ గ్రూప్ అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఆరోపించింది. ఈ గ్రూప్ కంపెనీలకు ఆస్తుల కంటే అప్పులు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయని, వీటి షేర్లు హై వాల్యుయేషన్‌లో ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్‌కు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని కూడా ఆరోపించింది. ఈ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లు వాటి ఫండమెంటల్స్ బట్టి 85 శాతం తగ్గాలని పేర్కొంది. మరోవైపు హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ షేర్లలో షార్టింగ్ చేసింది కూడా. అంటే షేర్లను ముందుగా అమ్మింది. ఆ తర్వాత ఈ రిపోర్ట్ విడుదల చేసింది.
100 బిలియన్ డాలర్లదిగువకు అదానీ సంపద..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో మూడో ప్లేస్‌లో కొనసాగిన గౌతమ్ అదానీ, తాజాగా ఏడో ప్లేస్‌కు పడిపోయారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గత రెండు సెషన్లలోనే 30 శాతం వరకు క్రాష్ అవ్వడంతో ఆయన సంపద 22 బిలియన్ డాలర్ల (రూ.1.8 లక్షల కోట్ల) మేర తగ్గింది. గౌతమ్ అదానీ సంపద ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 96 బిలియన్ డాలర్ల (రూ.7.87 లక్షల కోట్ల) కు పడిపోయింది. ప్రస్తుతం సంపద విషయంలో బిల్‌గేట్స్ (104 బిలియన్ డాలర్ల) తర్వాత గౌతమ్ అదానీ ఉన్నారు. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ లిస్టులో బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ (213 బిలియన్ డాలర్లు) మొదటి ప్లేస్‌లో, ఎలన్ మస్క్ (170 బిలియన్ డాలర్లు) రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నారు. జెఫ్ బెజోస్, ల్యారీ ఎల్లిసన్, వారెన్ బఫెట్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు ప్లేస్‌లలో ఉన్నారు.
సెబీ డేగ కన్ను..
స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్‌పై సెబీ స్క్రుటినీ పెంచింది. గత ఏడాది కాలంలో ఈ గ్రూప్ జరిపిన డీల్స్‌ను ఈ రెగ్యులేటరీ సంస్థ పరిశీలిస్తోంది. అంతేకాకుండా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన రిపోర్ట్‌ను స్టడీ చేస్తామని పేర్కొంది. కాగా, అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్ చేపట్టామని హిండెన్‌బర్గ్ ప్రకటించింది. ఈ కంపెనీకి పొజిషన్లు ఉన్నాయి కాబట్టే నెగెటివ్ రిపోర్ట్ విడుదలు చేసి కంపెనీ షేర్లు పడేటట్టు చేసిందా? అనే కోణంలో సెబీ దర్యాప్తు జరుపుతోంది.
అదానీ గ్రూప్ ఎఫ్‌పీఓ..
అదానీ షేర్లు క్రాష్ అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల ముందుకొచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) మొదటి రోజు ఒక శాతం సబ్‌స్క్రిప్షన్ సాధించింది. కంపెనీ మొత్తం 4.55 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా, 4.7 లక్షలు లేదా ఒక శాతం షేర్లకు బిడ్స్ వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ), క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈ పబ్లిక్ ఆఫర్ కోసం బిడ్స్ వేయడం ప్రారంభించారు. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 2 శాతం, ఉద్యోగుల కోసం కేటాయించిన షేర్లు 4 శాతం సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. మరోవైపు యాంకర్ ఇన్వెస్టర్ల పోర్షన్ మాత్రం బుధవారం పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఎఫ్‌పీఓలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు రూ.3,112–3,276 ప్రైస్ రేంజ్‌లో అందుబాటులో ఉండగా, శుక్రవారం ఈ కంపెనీ షేరు రూ.2,769 వద్ద క్లోజయ్యింది.
అదానీ బిజినెస్‌లు బాగున్నాయ్..
మరోవైపు అదానీ ఎంటర్‌ప్రెజెస్, అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని సీనియర్ ఇన్వెస్టర్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ పేర్కొన్నారు. ‘అదానీ షేర్లు కొనొచ్చా? వద్దా? అనేది ఇన్వెస్టర్ల ఇష్టం. మేము వీరిని ప్రభావితం చేయాలనుకోవడం లేదు. కానీ, లాంగ్‌టర్మ్‌లో అదానీ గ్రూప్ బిజినెస్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఈ గ్రూప్ సాధించిన గ్రోత్‌ను ఎవరూ కూడా అప్పులు చేయకుండా సాధించలేరు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను కొనమని కచ్చితంగా సలహాయిస్తా. కనీసం ఎఫ్‌పీఓలో అయిన కొనాలని చెబుతా. అంబుజా, అదానీ పోర్ట్స్ బిజినెస్‌లు ప్రస్తుత ధర దగ్గర ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి’ అని సంజీవ్ భాసిన్ పేర్కొన్నారు. అదానీ గ్రూప్ అసెట్స్ బాగున్నాయని, ఎల్‌ఐసీ లేదా ఇతర బ్యాంకులకు ఎటువంటి రిస్క్ లేదని అభిప్రాయపడ్డారు. ఈ గ్రూప్ మార్కెట్ క్యాప్ గత ఐదేళ్లలోనే రూ.20 లక్షల కోట్లకు పెరిగినప్పటికీ, బిజినెస్ కూడా అలానే ఉందని అన్నారు.
