ఆయిల్​ పామ్​ సాగుతో అధిక లాభాలు 

సిద్దిపేట రూరల్, వెలుగు​: ఆయిల్​ పామ్​ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఏడీఏ పద్మ అన్నారు. గురువారం నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది, జక్కాపూర్, గోపులాపూర్, నారాయణరావుపేట గ్రామాల్లోని ఆయిల్ పామ్ తోటలను ఏవో పరశురాంరెడ్డి, ఎఈవోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్న రైతులకు యాజమాన్యం పద్ధతులపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ పై డ్రిప్ ను అందిస్తున్నాయని, ఉద్యానశాఖ, ఉపాధి హామీ పథకం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నారని వెల్లడించారు.

ఆయిల్ పామ్ సాగు చేసిన ముడు నుంచి నాలుగేళ్ల వరకు అంతరపంటలైన వేరుశెనగ, పెసర, మొక్కజొన్న, ఇతర పప్పు దినుసుల పంటలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చుని చెప్పారు. ఆయిల్ పామ్ గెలలకు ప్రస్తుత మార్కెట్​లో టన్నుకు రూ. 19 వేల ధర వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏవో పరశురాంరెడ్డి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.