Indian history : బ్రిటిష్ వాళ్లు ఇండియాలో తెచ్చిన కౌన్సిల్ చట్టాలు

భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్​, గవర్నర్ జనరల్​ ఛెమ్స్​ఫర్డ్​లు కౌన్సిల్​ చట్టం–1919 చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అందువల్ల ఈ చట్టాన్ని మాంటేగ్​ – ఛెమ్స్​ఫర్డ్​ చట్టంగా పేర్కొంటారు. 1919 కౌన్సిల్​ చట్టం ప్రవేశికలో భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పేర్కొన్నారు. 

ద్విసభా విధానం: భారతదేశంలో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో ద్విసభా విధానాన్ని ప్రవేశ పెట్టారు. 
ఎ. కౌన్సిల్​ ఆఫ్​ స్టేట్స్​: ఈ సభ ఎగువసభగా పనిచేసింది. ఇందులోని సభ్యుల సంఖ్య 60. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. ఈ సభ అధ్యక్షుడు ఫ్రెడరిక్​ వైట్​. 

బి. లెజిస్లేటివ్​ కౌన్సిల్​: ఈ కౌన్సిల్​ మొత్తం సభ్యుల సంఖ్య స్పీకర్​ కాకుండా 144. వీరి పదవీకాలం 3 సంవత్సరాలు. అధ్యక్షుడు విఠల్​భాయి పటేల్​. ఉపాధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. పైన పేర్కొన్న సభల పదవీకాలం పూర్తికాక ముందే వాటిని రద్దు చేసే అధికారం గవర్నర్ జనరల్​కు ఉంటుంది. రాష్ట్రాల్లో శాసనసభల సభ్యుల సంఖ్యను పెంచారు.  
అధికారాల విభజన: ప్రభుత్వ పాలనాధికారాలను సూత్రప్రాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన చేశారు. 
ఎ. జాతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాలు కేంద్రానివి. మొత్తం 47 అంశాలపై కేంద్రానికి అధికారం కల్పించారు. 
ఉదా: విదేశీ వ్యవహారాలు, రక్షణ, కరెన్సీ, రైల్వేలుబి. ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాలు రాష్ట్ర ప్రభుత్వానివి. మొత్తం 50 అంశాలపై రాష్ట్రాలకు అధికారాలు కల్పించారు..

ఉదా: వ్యవసాయం, నీటిపారుదల, స్థానిక పరిపాలన, రోడ్డు రవాణా. 
రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం: రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాలను ప్రవేశపెట్టారు. అంటే ప్రభుత్వ పాలనా అంశాలను రెండు జాబితాలుగా వర్గీకరించారు. 
రిజర్వుడ్​ జాబితా(28 అంశాలపై అధికారాలు): ప్రాముఖ్యం కలిగిన అధికారాలు, ఆదాయం కలిగిన భూమిశిస్తు, శాంతిభద్రతలు, న్యాయం తదితర అంశాలు. ఈ జాబితాపై గవర్నర్​ నియమించే అధికారులకు అధికారాలు కల్పించారు. వీరు శాసనసభకు ఎలాంటి బాధ్యత వహించరు. 
ట్రాన్స్​పర్డ్​ జాబితా (22 అంశాలపై అధికారాలు): అధికారాలు, ప్రాముఖ్యం లేకుండా కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే శాఖలు ఈ జాబితాలో చేర్చారు. 

ఉదా: స్థానిక స్వపరిపాలన, ఆరోగ్యం, పారిశుద్ధ్యం. ఈ జాబితాపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు. వీరు శాసనసభకు సమష్టిగా బాధ్యత వహించాలి.  ద్వంద్వ ప్రభుత్వాన్ని మడ్డీమాన్ కమిటీ సమర్థించింది. 
చాంబర్​ ఆఫ్ ప్రిన్సెస్ ఏర్పాటు: భారతదేశంలోని స్వదేశీ రాజులతో కూడిన ఒక మండలిని ఏర్పాటు చేశారు. వీరందరూ బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వారితో స్నేహసహాయ సహకార సంబంధాలను కొనసాగించారు. లండన్​లో భారత హై కమిషనర్ అనే పదవిని ఏర్పాటు చేశారు. ఈ చట్టం అమలు తీరును 10 సంవత్సరాల తర్వాత పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిషన్​ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

సహాయ నిరాకరణ ఉద్యమం: 1920

1920లో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. 1922లో చౌరీచౌరా హింసాత్మక సంఘటన కారణంగా ఉద్యమాన్ని విరమించారు. 1923లో మోతీలాల్​ నెహ్రూ, చిత్తరంజన్​దాస్​లు స్వరాజ్​ పార్టీని స్థాపించారు. దేశంలో బ్రిటీష్​ వారు తమ అధికారాన్ని కొనసాగించడానికి కారణం భారతీయులు సహకరించడమే, దీనిని దృష్టిలో పెట్టుకొని భారతీయులు ఏ రూపంలో కూడా బ్రిటీష్​ వారికి సహకరించవద్దని గాంధీ పిలుపు ఇచ్చారు. 

సైమన్​ కమిషన్​ 

మాంటేగ్​  ఛెమ్స్​ఫర్డ్​ సంస్కరణల అమలు తీరును పర్యవేక్షించడానికి 1927లో సర్​ జాన్​ సైమన్​ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కమిషన్​ను ఏర్పాటు చేశారు. అప్పటి బ్రిటీష్​ ప్రధాని బాల్ద్విన్​. ఇది భారతదేశంలో బ్రిటీష్​ పరిపాలన తీరును పరిశీలించడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన కమిషన్. 1928లో సైమన్​ కమిషన్ భారత్​ను సందర్శించింది. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 3న బొంబాయి ప్రాంతాన్ని సందర్శించింది. ఈ కమిషన్​లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ భారత ప్రజలు సైమన్​ గో బ్యాక్​ అనే ఉద్యమం నిర్వహించారు. 1930లో సైమన్ కమిషన్​ తన నివేదికను లండన్​లో బ్రిటీష్​ ప్రభుత్వానికి సమర్పించింది. 

లాహోర్​ సమావేశం 1929

1929లో లాహోర్​లో జవహర్​లాల్​ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశం సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవంగా జరపాలని భారత జాతీయ కాంగ్రెస్​ తీర్మానించింది. 
శాసనోల్లంఘన ఉద్యమంబ్రిటీష్​ ప్రభుత్వ శాసనాలను ఉల్లంఘించాలని ఎందుకంటే అవి భారతీయుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నందున బ్రిటీష్​ వారి చట్టాలను భారతీయులు ధిక్కరించాలని కోరుతూ గాంధీ ఈ ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. 1930లో గాంధీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం అని కూడా పేర్కొంటారు. 

శ్వేతపత్రం: భారత్​లో బ్రిటీష్ వారు ప్రవేశపెట్టే చట్టానికి సంబంధించిన  వివరాలను 1933లో బ్రిటీష్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లార్డ్​ లిన్​లిత్​గో నేతృత్వంలోని సెలెక్ట్​ కమిటీ అధికారికంగా శ్రేతపత్ర రూపంలో ప్రకటించారు.  దీని ఆధారంగానే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

రౌండ్​ టేబుల్​ సమావేశాలు

సైమన్​ కమిషన్ నివేదికలోని అంశాలను చర్చించడం కోసం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరపడానికి బ్రిటీష్​ వారు లండన్​లో మూడు రౌండ్​ టేబుల్​ సమావేశాలు నిర్వహించారు. మహాత్మా గాంధీ రెండో రౌండ్​ టేబుల్​ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు గాంధీ, లార్డ్​ ఇర్విన్​ మధ్య 1931, మార్చి 5న ఒప్పందం కుదిరింది. దీన్నే ఇర్విన్ ఒప్పందంగా పేర్కొంటారు. ఈ ఒప్పందం పరిపాలనా అంశాలకు సంబంధించి కాదు. శాంతియుత పద్ధతుల్లో శాసనోల్లంఘన ఉద్యమం నిర్వహించడం, బ్రిటీష్​ వారు అక్రమ కేసులు, నిర్బంధాలు చేయకుండా ఉండటానికి ఇర్విన్​ ఒప్పందం జరిగింది. మూడు రౌండ్​ టేబుల్​ సమావేశాలకు బి.ఆర్.అంబేద్కర్ హాజరయ్యారు. 1932, ఆగస్టులో నాటి బ్రిటీష్​ ప్రధాని అయి న రామ్​సే మెక్​ డొనాల్డ్​ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. 1932లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రకటించిన కమ్యూనల్​ అవార్డుపై అంబేద్కర్​, గాంధీల మధ్య పూనా ఒప్పందం కుదిరింది. 

మొదటి రౌండ్​ టేబుల్​ సమావేశం : 1930, నవంబర్​ 12 నుంచి 1931, జనవరి 19
రెండో రౌండ్​ టేబుల్​ సమావేశం: 1931, సెప్టెంబర్ 7 నుంచి 1931, డిసెంబర్ 31
మూడో రౌండ్​ టేబుల్​ సమావేశం: 1932, నవంబర్​ 17 నుంచి 1932, డిసెంబర్ 24

1919 కౌన్సిల్​ చట్టాన్ని 1921లో అమలు చేయడం ద్వారా కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవించాయి. 
    1921లో పబ్లిక్ అకౌంట్స్​ కమిటీని ఏర్పాటు చేశారు.
    పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం కోసం లీ కమిషన్​ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ 1926లో నివేదిక సమర్పించింది. లీ కమిషన్ సూచనను అనుసరించి కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరుగా పబ్లిక్ సర్వీస్​ కమిషన్స్​ను ఏర్పాటు చేశారు. 
    కేంద్ర బడ్జెట్​ నుంచి రాష్ట్రాల బడ్జెట్​ను వేరు చేశారు. 
    ఇండియా కౌన్సిల్​ ప్రాధాన్యతను తగ్గించారు. 
    భారత రాజ్య కార్యదర్శి పదవి ప్రాముఖ్యతను తగ్గిస్తూ లండన్​లో భారత హైకమిషనర్​ను నియమించారు. 
    రైల్వే బడ్జెట్​ను సాధారణ బడ్జెట్​ నుంచి వేరు చేశారు. 
    ఉద్యోగుల ఎంపిక కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు.
    ఈ చట్టం కేవలం దేశంలో 2.6 శాతం ప్రజలకు మాత్రమే ఓటుహక్కును కల్పించింది.