ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి : ప్రకాష్ రాజ్

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించట్లేదు... ఈ అంశంపై దాఖలైన పలు పిటీషన్లపై సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) విచారణ జరిపిన సుప్రీంకోర్టు... దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా దుమారం రేపిన ఈ అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి స్పందించారు. తాజాగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు పరోక్షంగా చురకలంటించారు.

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా.. ఇక చాలు,  ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటీషన్లపై తదుపరి విచారణను గురువారానికి ( అక్టోబర్ 3, 2024 ) వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఈ అంశంపై వెళ్ళడించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.