Mohan Babu: సుప్రీం కోర్టును ఆశ్రయించిన సినీ నటుడు మోహన్ బాబు

టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మోహన్ బాబు (Mohan Babu) తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు.

ఇవాళ సోమవారం జనవరి 6న మోహన్ బాబు పిటిషన్పై విచారణ జరగనుంది. 'తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని.. అందుచేత తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని" మోహన్ బాబు వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో మోహన్ బాబుకి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే, మోహన్ బాబు ఆరోగ్య దృష్ట్యా సుప్రీం కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందనే ఆశాభావం కనిపిస్తోంది.

అసలేం జరిగిందంటే..?

మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మోహన్ బాబుకు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‎కు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లాడు. మనోజ్‎ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన మనోజ్ గేట్లు బలవంతంగా తోసుకుని ఇంట్లోకి వెళ్లాడు. దీంతో మోహన్ బాబు నివాసంలో ఉద్రిక్త నెలకొంది. 

ఈ క్రమంలో మోహన్ బాబు ఇంట్లో జరుగుతోన్న ఈ పరిణామాలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు చిందులు తొక్కాడు. విచక్షణ కోల్పోయి ఏకంగా జర్నలిస్టుపై దాడి చేశాడు మోహన్ బాబు. రిపోర్టర్ చేతిలోని మైక్ ను లాక్కొని దాడి చేశాడు. ఈ ఘటనలో రిపోర్ట్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది.

ఈ క్రమంలోనే బాధిత జర్నలిస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు మోహన్ బాబు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు.. మోహన్ బాబు అభ్యర్థనను తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక తాజాగా మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.