అల్లు అర్జున్​పై రూల్స్​ ప్రకారమే చర్యలు: డీజీపీ జితేందర్

  • సినిమాల్లో హీరోలైనా బయట పౌరులే
  • గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని నడుచుకోవాలి 
  • సంధ్య థియేటర్ ఘటనలో చట్టం మేరకే ముందుకని వెల్లడి
  • కరీంనగర్​లో భరోసా సెంటర్​ ప్రారంభం

కరీంనగర్, వెలుగు: సినిమాల్లో హీరోలైనా బయట చట్టం దృష్టిలో పౌరులేనని, వారు గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకుని నడుచుకోవాలని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. అల్లు అర్జున్ మీద చట్టపరంగానే చర్యలు తీసుకున్నాం తప్పితే వ్యక్తిగతంగా తీసుకోలేదని స్పష్టంచేశారు. సంధ్య థియేటర్ ఘటనలో చట్ట ప్రకారం ముందుకెళ్తున్నామని తెలిపారు.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఎస్ బీఐ సీఎస్ ఆర్ నిధులతో నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆదివారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మోహన్ బాబుది వాళ్ల కుటుంబ వ్యవహారం. కానీ మీడియాపై దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదు చేశాం. సినిమాల్లో హీరోలైనా బయట పౌరులే. ఎవరైనా సరే గ్రౌండ్​ రియాలిటీస్​ను తెలుసుకొని నడచుకోవాలి” అని సూచించారు. 

రాష్ట్రంలో మావోయిస్టులు లేరు

రాష్ట్రంలో మావోయిస్టులు లేరని, మనకు ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రకమిటీ కూడా అక్కడి నుంచే పనిచేస్తున్నదని డీజీపీ జితేందర్​ తెలిపారు. రాష్ట్రంలోకి వచ్చి ఇన్ ఫార్మర్ల నెపంతో అమాయకులను చంపుతామంటే ఊరుకోబోమని, అదే స్థాయిలో తాము స్పందిస్తామన్నారు. భరోసా సెంటర్లు వచ్చాక మహిళలు, చిన్నారులకు రక్షణ పెరిగిందని.. ఎక్కడైనా వారికి ఇబ్బందులు ఎదురైతే భరోసా సెంటర్ కు రావొచ్చని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల అధికారులు కూడా మన భరోసా సెంటర్లను సందర్శించి మోడల్​గా తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు కూడా భరోసా కేంద్రాల పనితీరును ప్రశంసించిందన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు పరిహారం ఇప్పించడంతోపాటు నేరస్తులకు శిక్ష విధించేలా చేయడంలో సక్సెస్ అవుతున్నామని డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో 27 భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయని.. వీటిలో డాక్టర్, అడ్వకేట్ కూడా అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కార్యక్రమంలో ఉమెన్ సేఫ్ట్ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, ప్రొబేషనరీ ఐపీఎస్ యాదవ్ వసుంధర పౌరేబీ, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ మాధవి, ఇన్ స్పెక్టర్ శ్రీలత పాల్గొన్నారు.