ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రీల్స్ కట్ చేస్తాం: పుష్ప 2 ఘటనపై ఏసీపీ ఫైర్

హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‎లోని సంథ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన తెలంగాణ స్టేట్‎లో హాట్ టాపిక్ మారింది. ఈ ఘటనపై అసెంబ్లీ సాక్షిగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. హీరో అల్లు అర్జున్ తీరుపై విమర్శలు గుప్పించారు. సీఎం వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్‏గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే అని రీ కౌంటర్ ఇవ్వడంతో పుష్ప తొక్కిసలాట ఇష్యూ ఇటు సినీ, అటు పొలిటికల్ సర్కిల్స్‎లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ వ్యవహారం, పుష్ప -2 సినిమా విడుదల, తదనంతర పరిణామాలపై ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. 

2024, డిసెంబర్ 22న హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ.. కేసు విచారణ కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ దగ్గర గ్యాదరింగ్ వద్దని పోలీసులు చెప్పిన అల్లు అర్జున్ వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదని విమర్శించారు.

 సంథ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాటతోనే మహిళా చనిపోయిందని ఆరోపించారు. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని.. పబ్లిక్ ప్లేసులలో సెలెబ్రెటీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు తమ డ్యూటీలు సరిగ్గానే నిర్వహించారని.. పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అవమానపర్చటం సరికాదని హితవు పలికారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని.. అధికారులను ఇష్టం వచ్చినట్లు తిడితే రీల్స్ కట్ చేస్తామని ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

 చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికే పోలీసులపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. వాపును చూసి బలమని మురిసిపోవద్దని అన్నారు. సినిమాల్లో కూడా పోలీసులను అమానించడం మానుకోవాలని.. ఇష్టానుసారం ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దొంగతనాలపై సినిమా తీసి ప్రజలకు ఏం సందేశం ఇస్తు్న్నారని సూటిగా ప్రశ్నించారు. మీరేమైనా దేశ ప్రతిష్టను పెంచేలా మూవీలు తీస్తున్నారా అని నిలదీశారు. దొంగలు, రౌడీలు, స్మగ్లర్లలా కాకుండా..  సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రోత్సాహిస్తామని అన్నారు.