షమీ రాలేడు..ఆసీస్‌తో చివరి రెండు టెస్టులు ఆడే చాన్స్ లేదు :  బీసీసీఐ

న్యూఢిల్లీ : ఇండియా స్టార్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ షమీ పూర్తి ఫిట్‌‌నెస్‌‌తో లేడని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. దీంతో బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు అతనుఅందుబాటులోకి రాబోడని స్పష్టం చేసింది. షమీ ఎడమ మోకాలిలో స్వల్పంగా వాపు వచ్చిందని, బోర్డు మెడికల్‌‌ టీమ్‌‌ దీనికి చికిత్స అందిస్తోందని తెలిపింది. ‘కుడి మడమ సర్జరీ తర్వాత సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌లోని బీసీసీఐ మెడికల్‌‌ టీమ్‌‌ షమీని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

అతను దీని నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కానీ ఎడమ మోకాలిలో చిన్న వాపు వచ్చింది. బౌలింగ్ వర్క్‌‌లోడ్‌‌ వల్ల జాయింట్స్‌‌పై ఎక్కువగా భారం పడింది. అయితే ఈ వాపు పరిమితికి లోబడే ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని బీసీసీఐ షమీ మెడికల్, ఫిట్‌నెస్‌ రిపోర్టును వెల్లడించింది.  ఓ రంజీ మ్యాచ్‌‌లో 43 ఓవర్లు బౌలింగ్‌‌ చేసిన షమీ  ఆ వెంటనే జరిగిన సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నీలో 9 మ్యాచ్‌‌లు ఆడాడు.

దీనికితోడు బౌలింగ్ ప్రాక్టీస్‌‌ సెషన్స్‌‌తో పాటు రాబోయే టెస్ట్‌‌ సిరీస్‌‌ కోసం తనకు తానుగా కొన్ని ప్రాక్టీస్‌‌ల్లో పాల్గొన్నాడు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత షమీ మోకాలిపై ఎక్కువ బౌలింగ్‌‌ భారం పడకుండా బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందుకే అతన్ని అన్‌‌ ఫిట్‌‌గా ప్రకటించామని బోర్డు పేర్కొంది.