చెంచు మహిళపై దాడి కేసులో నిందితుల రిమాండ్

అమ్రాబాద్, వెలుగు : చెంచు మహిళపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చెంచు సంఘం నాయకులు డిమాండ్  చేశారు. శుక్రవారం ఎస్పీకి వినతిపత్రం అందించారు. బాధితురాలిని పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెంచు సంఘం నాయకులు నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈశ్వరమ్మపై దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామస్వామి, శివ, గోవిందు, మల్లయ్య పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్ : చెంచు మహిళపై దాడికి పాల్పడిన వారికి ఉరి శిక్ష విధించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించారు. పోలీసులు కొందరిపై కేసు నమోదు చేసి మిగతా వారిని వదిలివేయడం జరిగిందన్నారు. బాధిత మహిళకు బీజేపీ అండగా ఉంటుందని, నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు జానకి పాల్గొన్నారు.

రూ.25 లక్షలు చెల్లించాలి

బాధితురాలు ఈశ్వరమ్మ ఫ్యామిలీకి రూ.25 లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని చైతన్య మహిళా సంఘం కో కన్వీనర్  శ్రీదేవి డిమాండ్  చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. గిరిజన మహిళపై దాడికి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్  చేశారు. కస్తూరి, శాంతమ్మ పాల్గొన్నారు.