నల్లాల లెక్క తప్పింది

  • సర్వేలో 20 వేల కనెక్షన్లు ఇవ్వలేదని గుర్తించిన ఆఫీసర్లు! 
  • జిల్లా కేంద్రంలో ఇప్పటికీ తాగునీటికి తప్పని తిప్పలు 

నాగర్​కర్నూల్, వెలుగు : మిషన్  భగీరథ స్కీం కింద ఇంటింటికీ ఇచ్చిన నల్లా కనెక్షన్ల లెక్కలు దొరకడం లేదు. నీటి సప్లై, ఇంటింటి కనెక్షన్లపై ఇటీవల నిర్వహించిన సర్వేలో దాదాపు 20 వేల కనెక్షన్లు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తించినట్లు సమాచారం. అయితే ఇతర జిల్లాలతో పోలిస్తే నాగర్​కర్నూల్​ జిల్లా చాలా బెటర్ గా​ఉందని చెప్పుకుంటున్నారు. సర్వేలో 10 శాతం నల్లా కనెక్షన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు లెక్కల్లో చూపించినట్లు సమాచారం. జిల్లాలో 20 మండలాలు,451 గ్రామ పంచాయితీలు,4 మున్సిపాలిటీలు ఉన్నాయి.

ఇంట్రా ద్వారా గ్రామాల్లో 1.97లక్షల ఇళ్లకు భగీరథ కనెక్షన్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. నాగర్​ కర్నూల్​ మున్సిపాలిటీలో 11వేలు, కల్వకుర్తిలో 8,500, కొల్లాపూర్​లో 6,883, అచ్చంపేటలో 9,500 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇదిలాఉంటే జిల్లాలో ఇప్పటికీ 2 వేల సింగిల్​ ఫేజ్​ బోర్​ మోటార్లు, గ్రామాల్లో 1,200 త్రీఫేజ్​ మోటర్లు పని చేస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటిని స్టాండ్​బైలో ఉంచుతామని అధికారులు చెబుతున్నా.. అవే ఎక్కువగా ఆదుకుంటున్నాయని సమాచారం. మిషన్​ భగీరథ గ్రిడ్​ అధికారులు ఎల్లూరు, గౌరిదేవిపల్లి, కల్వకుర్తి డబ్ల్యూటీపీల ద్వారా నీటిని ఫిల్టర్​ చేస్తే ఎంట్రా అధికారులు ఓవర్​ హెడ్​ ట్యాంకుల ద్వారా ఇంటింటికీ నీటిని సప్లై చేస్తున్నారు. ఇదిలాఉంటే బిజినేపల్లి, తెల్కపల్లి, కోడేరు, లింగాల, అమ్రాబాద్, వెల్డండ, పెద్దకొత్తపల్లి, చారకొండ మండలాల్లో నల్లా కనెక్షన్లు లేవనే కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయి.

జిల్లా హెడ్​క్వార్టర్​లోనూ..

 గౌరిదేవిపల్లి డబ్ల్యూటీపీ నుంచి నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రానికి వచ్చే మెయిన్​ పైప్​లైన్​కు కొల్లాపూర్​ చౌరస్తాలో డబ్ల్యూటీపీ నిర్మించి మున్సిపాలిటీలోని వాటర్​ ట్యాంక్​లకు కనెక్షన్​ ఇవ్వాల్సి ఉంది. అయితే ఉయ్యాలవాడ లైన్​ నుంచి కనెక్ట్​ చేశారు. దీంతో కొల్లాపూర్​ చౌరస్తాలో నిర్మించిన ఇండ్లు, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, కమర్షియల్​ కాంప్లెక్స్​లకు నీటి సమస్య ఎదురవుతోంది. జిల్లా కేంద్రంలోని నాలుగు వార్డులకు ఇప్పటికీ భగీరథ నీటి సప్లై లేదు. పాత ట్యాంకుల్లో డైరెక్ట్​ పంపింగ్​ ద్వారా నీటిని నింపి సప్లై చేస్తున్నారు.

62 బోర్ల నుంచి49 సింగిల్ ఫేజ్, 3 త్రీ ఫేజ్​ మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక ఎస్సీ, బీసీ కాలనీలు, మధురానగర్​కు నీటి గండం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్​ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాగర్​కర్నూల్, వట్టెం సమీపంలో కొత్త డబ్ల్యూటీపీ(వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్), పైప్​లైన్ల నిర్మాణం కోసం రూ.3 కోట్లతో ఎంట్రా అధికారులు ప్రపోజల్స్​ సిద్దం చేశారు.