లోక్​సభ ఎన్నికల్లో 8 వేల మంది పోటీ

లోక్​సభ ఎన్నికల్లో 8 వేల మంది పోటీ
  • 16% జాతీయ పార్టీల నుంచే..
  • 47% ఇండిపెండెంట్లుగా బరిలోకి
  • పీఆర్ఎస్ లెజిస్లేటివ్  రీసెర్చ్ వెల్లడి

న్యూఢిల్లీ: తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీచేశారని పీఆర్ఎస్  లెజిస్లేటివ్  రీసెర్చ్  సంస్థ తెలిపింది. వారిలో 16 శాతం జాతీయ పార్టీ ల నుంచి బరిలోకి దిగగా..47 శాతం మంది ఇండిపెండెంట్లుగా పోటీచేశారని ఆ సంస్థకు చెందిన ఓ రిపోర్టు వెలడించింది. 1996 నుంచి ఇంతమంది క్యాండిడేట్లు పోటీచేయడం ఇదే అత్యధికమని, 1996 ఎన్నికల్లో 13,952 మంది పోటీచేశారని పేర్కొంది. గడిచిన 2019 లోక్ సభ ఎన్నికల్లో 8,039 మంది బరిలో నిలిచారు. పీఆర్ఎస్ డేటా ప్రకారం.. తాజా లోక్ సభ ఎన్నికల్లో 744 పార్టీల తరపున 543 సీట్లలో 8,360 మంది పోటీచేశారు. వాటిలో జాతీయ హోదా గుర్తింపు పొందిన ఆరు పార్టీలు ఉన్నాయి. బహుజన్ సమాజ్  పార్టీ(బీఎస్పీ) అత్యధికంగా 488 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. 441 మంది క్యాండిడేట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్  నుంచి 328, సీపీఎం నుంచి 52, ఆప్  నుంచి 22 అభ్యర్థులు పోటీ చేశారు.

ప్రాంతీయ పార్టీల్లో ఎస్పీ టాప్

ప్రాంతీయ పార్టీల్లో 71 మంది అభ్యర్థులతో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) టాప్  ప్లేస్ లో ఉంది. టీఎంసీ నుంచి 48, అన్నాడీఎంకే నుంచి 36, సీపీఐ తరపున 30, వైసీపీ నుంచి 25, ఆర్జేడీ నుంచి 24 మంది, డీఎంకే తరపున 22 మంది క్యాండిడేట్లు పోటీచేశారు. గుర్తింపులేని పార్టీల్లో సోషియల్ యూనిటీ సెంటర్  ఆఫ్​  ఇండియా (కమ్యూనిస్ట్) నుంచి అత్యధికంగా 150 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పీపుల్స్  పార్టీ ఆఫ్​ ఇండియా(డెమోక్రటిక్) 79 మంది అభ్యర్థులను నిలబెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక ప్రతి నియోజకవర్గానికి సగటున 15 మంది అభ్యర్థులు పోటీచేశారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 31 మంది పోటీచేయగా.. లద్దాఖ్, నాగాలాండ్​లో ముగ్గురు క్యాండిడేట్లు బరిలోకి దిగారు. తమిళనాడులోని కరూర్  సీటులో అత్యధికంగా 54 మంది పోటీచేశారు. వారిలో 46 మంది అభ్యర్థులు (85%) ఇండిపెండెంట్లే.

అభ్యర్థి సగటు వయసు 48 ఏండ్లు

అభ్యర్థుల సగటు వయసు 48 సంవత్సరాలు. జాతీయ పార్టీల తరపున పోటీచేసిన వారిలో 13% మంది క్యాండిడేట్ల వయసు 40 ఏండ్లలోపే. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థుల్లో 20% మంది 40 ఏండ్లలోపు వారు ఉన్నారు.

మహిళా అభ్యర్థులు 9.6 శాతం మందే

తాజా లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు పోటీచేయగా.. వారిలో మహిళా క్యాండిడేట్లు 797 మందే (9.6) మందే ఉన్నారని అసోసియేషన్  ఆఫ్  డెమో క్రటిక్  రిఫార్మ్స్  (ఏడీఆర్) తెలిపింది. లోక్ సభలో మహిళా బిల్లు పాస్  చేసిన నేపథ్యంలో ఈసారి పోటీచేసే మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించారు. కానీ, వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని ఏడీఆర్  పేర్కొంది.