పీవోకేలో టెర్రరిస్ట్​ క్యాంపులు

పీవోకేలో టెర్రరిస్ట్​ క్యాంపులు
  • దగ్గరుండి శిక్షణ ఇప్పిస్తున్న పాక్ ఐఎస్ఐ

న్యూఢిల్లీ: పాకిస్తాన్​ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో ఇంటర్​ సర్వీసెస్​ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఆధ్వర్యంలో టెర్రరిస్ట్​ క్యాంపులు నడుస్తున్నాయి. పీవోకేలోని మన్​షేరా, ముజఫరాబాద్, కోట్లి క్లస్టర్లలో లష్కర్​ఏ తొయిబా(ఎల్ఈటీ), జైష్ ఏ మహమద్(జేఈఎం), అల్​ బదర్, హర్కత్​వుల్​ ముజాహిదీన్ తదితర టెర్రర్ సంస్థలు ఈ క్యాంపులను నిర్వహిస్తున్నాయి. మన్​షేరా క్లస్టర్​లో బోయి, బాలాకోట్, గర్హి హబిబుల్లాల్లో క్యాంపులు ఉన్నాయి. ముజఫరాబాద్​ క్లస్టర్​లో ఛేలాబండీ, షవైనలా, అబ్దుల్లా బిన్​ మసూద్, దులై ప్రాంతాల్లో క్యాంపులు నడుస్తున్నాయి. కోట్లి క్లస్టర్​లోని సేన్సా, కోట్లి, గుల్పూర్, ఫగోష్, దుబ్గిల్లో నడుస్తున్న టెర్రరిస్టు కార్యకలాపాలను పాక్ ఆర్మీకి చెందిన మూడు బ్రిగేడ్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయి. ఎల్​వోసీ కి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురేజ్, కెల్, నీలమ్ వ్యాలీ, తంగ్​ధార్, యురి ఛకోటి, గుల్మార్గ్, పూంచ్, రాజౌరి, నౌషేరా, సుందర్​బనీ సెక్టార్లలో ఉండే లాంచ్​ ప్యాడ్లకు ఫీడర్ల కోసం ఈ క్యాంపులు నడుస్తున్నాయని సమాచారం.

మిషన్​ కాశ్మీర్
ఐఎస్ఐ మిషన్​ కాశ్మీర్​ ఆపరేషన్​ చేపట్టిందని, ఈ రీజియన్​లో మనుగడ, ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఆపరేషన్​ చేపట్టిందని ఐఎస్ఐ రిటైర్ట్​ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఎల్ఈటీ, జేఈఎం, తెహ్రీక్ ఈ తాలిబాన్​ పాకిస్తాన్, ఇస్లామిక్ స్టేట్ విలయాహ్ హింద్ తదితర గ్రూపులతో కలిపి ఒక కొత్త గ్రూపును ఏర్పాటు చేస్తోందని, దానితో కలిసి జమ్మూ కాశ్మీర్​ విముక్తి కోసం ఈ పోరాటమని చెబుతోందని పేర్కొన్నారు.