ప్రమాదాలకు నిలయంగా మెదక్​ రోడ్డు

  • యాక్సిడెంట్లతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు
  • పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ సమస్యలు
  • ప్రకటనలకే పరిమితమైన రింగ్​రోడ్డు నిర్మాణం

మెదక్, వెలుగు: మెదక్​పట్టణం గుండా ఎటు వెళ్లాలన్నా ఒకే రోడ్డు దిక్కవుతోంది. జిల్లాలోని వివిధ మండలాల వారితో పాటు, పొరుగు జిల్లాల వారు హైదరాబాద్, బోధన్, బాన్సువాడ, సిద్దిపేట, వరంగల్, సంగారెడ్డి, జహీరాబాద్, కర్నాటక రాష్ట్రంలోని బీదర్ కు వెళ్లాలంటే మెదక్​ పట్టణం మీదుగానే వెళ్లాలి. బోధన్​, బాన్సువాడ, కామారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, సంగారెడ్డి, మెదక్ ఆర్టీసీ డిపో బస్సులు, ప్రైవేట్​వాహనాలు, బోధన్​, గోదావరిఖని నుంచి హైదరాబాద్​ఇసుక తరలించే పెద్ద పెద్ద లారీలు, మెదక్​ చుట్టు పక్కల నుంచి కంపెనీలకు, రోడ్ల నిర్మాణానికి మట్టి, స్టోన్​డస్ట్​, కంకర తరలించే టిప్పర్లు, కంపెనీల కు ముడిసరుకు, ప్రొడక్ట్స్ తీసుకెళ్లే భారీ కంటెయినర్ లారీలు అన్నీ పట్టణం మధ్యలో ఉన్న రోడ్డు మీదుగానే వెళ్లాలి. 

పట్టణంలో జనాభా పెరగడంతోపాటు, జిల్లా కేంద్రమైన తర్వాత ఆయా మండలాల నుంచి కలెక్టరేట్​లో ఉన్న ఇతర డిపార్ట్ మెంట్లలో​పనుల కోసం ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారుల రాకపోకలు ఎక్కువ కావడంతో ట్రాఫిక్ బాగా పెరిగింది. బస్సులు, కార్లు, బైక్​లు ఎక్కువ సంఖ్యలో తిరుగుతుండగా ​ఇదే రోడ్డు మీదుగా భారీ వెహికల్స్​ రాకపోకలు సాగిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్​ నిబంధనలు పాటించకుండా స్పీడ్​గా వెళ్తుండడం, చౌరస్తాల్లో సిగ్నల్​ పడినా పట్టించుకోకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

ప్రమాదాలు ఇలా..

గతేడాది నవంబర్​లో దీపావళి రోజు పట్టణంలోని మెయిన్​రోడ్డుమీద గోల్కోండ వీధి దగ్గర ఓవర్​ స్పీడ్​తో వెళ్తున్న టిప్పర్​స్కూటీని ఢీకొనడం వల్ల కవల పిల్లలు మృతి చెందారు. వారి తల్లి తీవ్రంగా గాయపడింది. నాలుగు నెలల కింద న్యూబస్​ స్టాండ్​సమీపంలో టిప్పర్​ బైక్​ను ఢీకొట్టడంతో జంబికుంటకు చెందిన ఓ వ్యక్తి  స్పాట్​లోనే ప్రాణాలు కోల్పోయాడు. 

తాజాగా రెండు రోజుల కింద రాందాస్​ చౌరస్తాలో నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్​ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. 
టిప్పర్లు, ఇసుక లారీలు, భారీ కంటెయినర్లు​పట్టణం మధ్యలో నుంచి ఉన్న రోడ్డు మీదుగా కాకుండా బయట నుంచి వెళ్లేందుకు వీలుగా రింగ్​ రోడ్డు, బైపాస్​ రోడ్డు ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదని జనాలు భావిస్తున్నారు. 

హైవేల అనుసంధానంతో..

హైదరాబాద్​ బాలానగర్ నుంచి నర్సాపూర్​ మీదుగా మెదక్ పట్టణం వరకు నేషనల్​ హైవే (765 డి) నిర్మాణం పూర్తయింది. మెదక్​ పట్టణం నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు మరో నేషనల్​ హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల మెదక్ నుంచి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మీదుగా బోధన్​ వరకు మరో నేషనల్​ హైవే నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇలా మెదక్ పట్టణానికి మూడు హైవేల అనుసంధానం ఏర్పడుతుండడంతో ట్రాఫిక్​ మరింత పెరగనుంది. మూడు హైవేలు వచ్చినా రింగ్​ రోడ్డు లేదా బైపాస్ రోడ్డు లేకపోవడడం వల్ల ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.

ప్రకటనలకే పరిమితం

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం 2016లో  జిల్లాల పునర్ ​వ్యవస్థీకరణ చేపట్టిన క్రమంలో కొత్త జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్డు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మెదక్​ పట్టణానికి రింగ్​రోడ్డు మంజూరవుతుందని అప్పటి మంత్రి హరీశ్​రావు, అప్పటి మెదక్​ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి చెప్పారు. ఆర్​అండ్​బీ అధికారులతో కలిసి ఎక్కడి  నుంచి రింగ్​ రోడ్డు నిర్మించాలనే దాని గురించి పరిశీలన చేశారు. కానీ రింగ్​ రోడ్డు నిర్మాణం ప్రకటనకే పరిమితమైంది. ప్రస్తుత ప్రభుత్వమైన ట్రాఫిక్​ ఇబ్బందులు, ప్రమాదాలు గుర్తించి మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు మంజూరు చేయాలని మెదక్​ పట్టణ, పరిసర ప్రాంత వాసులు కోరుతున్నారు.