ప్రాణాలు తీస్తున్న వడ్ల కుప్పలు...రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు

మెదక్​/శివ్వంపేట, వెలుగు : వాహనాలు తిరిగే రోడ్లపై వడ్లు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.  శనివారం రాత్రి మనోహరాబాద్ మండలం పోతారం వద్ద ట్రాక్టర్​ బైక్​ను ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడానికి రోడ్డుపై వడ్ల కుప్పలే కారణమయ్యాయి. ఈ ఒక్క సంఘటనే కాదు ప్రతి ఏటా వానకాలం, యాసంగి పంట కోత సీజన్ లో ఇదే సమస్య ఎదురవుతోంది. గడిచిన మూడేళ్లలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోడ్లపై వడ్ల కుప్పల కారణంగా ప్రమాదాలు జరిగి పది మందికి పైగా  చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేకపోవడం వల్ల రైతులు రోడ్లపై వడ్లు ఆరబోస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.  

అనేక రోడ్లపై..

గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులతో పాటు, నేషనల్​ హైవేలపై సైతం రైతులు వడ్లు ఆరబోస్తున్నారు. నర్సాపూర్​నుంచి తూప్రాన్​వెళ్లే రూట్​లో,  మెదక్​ పాపన్నపేట, పెద్దశంకరంపేట రూట్​లో, కొల్చారం  వెల్దుర్తి, రంగంపేట- జోగిపేట, చేగుంట  బోనాల రూట్​లతో పాటు 44 నెంబర్​ నేషనల్​ హైవే పై, మెదక్ - హైదరాబాద్​నేషనల్​హైవేపై  కిలోమీటర్ల పొడుగునా వడ్లు ఆరబోస్తున్నారు. రాత్రి పూట వడ్లను కుప్ప చేసి వర్షానికి తడవకుండా టాపర్లు​కప్పి, గాలికి ఎగిరి పోకుండా బండరాళ్లు పెడుతున్నారు. రోడ్డు సగం వరకు ఆక్రమించి వడ్లు ఆరబోస్తుండగా రాత్రి వేళ కుప్పలు, బండరాళ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతోపాటు, ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై సగం వరకు వడ్ల కుప్పలు ఉండడంతో ఒకే వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇది ప్రమాదాలకు దారి తీస్తోంది. 

కాంటా మొదలు కాక..

గత వారం, పది రోజులుగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. కానీ ధాన్యం కాంటా పెట్టడం లేదు. ఈ కారణంగా పెద్ద మొత్తంలో ధాన్యం పేరుకుపోతోంది. కేంద్రాల వద్ద స్థలం సరిపోక చాలా మంది రైతులు వడ్లను రోడ్లపై ఆరబోస్తున్నారు. పోలీసులు ఎంత చెబుతున్నా ఎవరూ వినడం లేదు. ప్రమాదాలు జరిగితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. రోడ్లపై వడ్లు ఆరబోయకుండా పోలీసులు రైతులకు అవగాహన కల్పించాలి.