కారు ఢీకొని హౌస్​కీపర్​ మృతి..మాదాపూర్ 100 ఫీట్స్ ​రోడ్డులో ప్రమాదం

మాదాపూర్, వెలుగు : డ్యూటీ అయిపోయాక సైకిల్​పై ఇంటికి వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మాదాపూర్​100 ఫీట్స్​రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన గణేశ్(34) తన భార్య పార్వతితో కలిసి ఏడు నెలల కింద హైదరాబాద్​కు వచ్చాడు. బోరబండ తులసినగర్ లో ఉంటూ మాదాపూర్​లోని ఓ ప్రైవేట్​కంపెనీ లో హౌస్ కీపర్​గా పనిచేస్తున్నాడు.

శుక్రవారం నైట్ డ్యూటీకి వెళ్లాడు. శనివారం ఉదయం 7 గంటలకు సైకిల్​పై ఇంటికి వెళ్తుండగా మాదాపూర్ 100 ఫీట్స్ రోడ్డులో వెనుక నుంచి వేగంగా వచ్చిన టీఎన్85ఏఆర్5657 నంబర్​కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణేశ్ స్పాట్​లోనే చనిపోయాడు. మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

బైక్​ అదుపు తప్పి యువకుడు..

హైదరాబాద్​సిటీ: ఓవర్​స్పీడ్​కారణంగా బైక్​అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. కిస్మత్​పూర్​కు చెందిన సాత్విక్(17), నిశాంక్(17) బైక్​పై శనివారం సాయంత్రం బయటికి వెళ్లారు. పుప్పాలగూడ పరిధిలోని ఫిషర్​మెన్​హోటల్​సమీపంలో ఓవర్​స్పీడ్​కారణంగా వీరి బైక్​అదుపు తప్పి కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టింది. బైక్​నడుపుతున్న సాత్విక్ ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే చనిపోయాడు. నిశాంక్  తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నార్సింగి పోలీసులు కేసు ఫైల్​చేశారు.