హరీశ్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నరు : వంశీకృష్ణ

  •     కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజార్టీ నిరూపిస్తే రాజకీయ సన్యాసం
  •     అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్

అచ్చంపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు మతిభ్రమించి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఫైరయ్యారు. అచ్చంపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండారెడ్డిపల్లిలో బీజేపీకి మెజార్టీ వచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. 

కొండారెడ్డిపల్లిలో బూత్ నంబర్ 15లో బీఆర్ఎస్​కు 131, బీజేపీకి 103 ఓట్లు వస్తే.. కాంగ్రెస్​కు  694 ఓట్లు వచ్చాయన్నారు. బూత్ నంబర్ 16 లో బీఆర్ఎస్​కు 65 , బీజేపీకి 135 ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు 527 ఓట్లు వచ్చాయన్నారు. రానున్న రెండు నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగై పోవడం ఖాయమన్నారు. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని, ముందుగా హరీశ్ రావును బీజేపీలోకి పంపి తర్వాత కేసీఆర్ సైతం వెళ్తారని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో అచ్చంపేట జడ్పీటీసీ మంత్రియా నాయక్, ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, బల్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.