Formula E Race: మాజీ మంత్రి KTRపై నమోదైన FIRలో ఉన్న కీలక అంశాలు ఇవే..

హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేస్‎ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. బుధవారం(డిసెంబర్ 18, 2024) సాయంత్రం ఏసీబీకి 5:30కు ఫార్ములా–ఈ కార్ రేస్ గురించి ఫిర్యాదు అందింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ఈ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయగా అవకతవకలు బయటపడ్డాయి. దాన కిషోర్ ఫిర్యాదు మేరకు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది.

అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్​బండ్​ చుట్టూ ఐమాక్స్​ సమీపంలో 2023లో కార్ల రేసింగ్ (ఫార్ములా రేస్​ సీజన్​ ఈవెంట్​9)​ను నిర్వహించారు. దీని వల్ల హైదరాబాద్ జనం నానా తిప్పలు పడ్డారు. అప్పుడు రేసింగ్​ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండీఏ రూ.20 కోట్లు, రేస్కు ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జెన్​అనే ప్రైవేట్​ఏజెన్సీ దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్తో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్​ లైట్లు.. ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. సీజన్​ 9 ఈవెంట్​నిర్వహణకు హెచ్ఎండీఏ, నెక్స్ట్ జెన్​, ఫార్ములా–ఈ  కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్​9 నిర్వహణ వల్ల హెచ్​ఎండీఏకు గానీ, నెక్ట్స్​ జెన్​ సంస్థకు గానీ ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది.

కేటీఆర్పై నమోదైన FIRలో ఉన్న కీలక అంశాలు..
* FIR నెంబర్12/ RCO- CIU- ACB 2024
* పీసీ యాక్ట్, ఐపిసి యాక్ట్ కింద కేసులు నమోదు
*13(1)(A)13(2)PC Act, 409, 120B IPC సెక్షన్స్ కింద కేసు నమోదు
* బుధవారం(డిసెంబర్ 18, 2024) సాయంత్రం 5:30కు ఏసీబీకి ఫిర్యాదు అందింది
*  ఫిర్యాదు చేసిన గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దాన కిషోర్
* ఆయన ఫిర్యాదు మేరకు A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు
* ప్రభుత్వం విచారణ చేయగా బయటపడ్డ అవకతవకలు
* ప్రభుత్వ నిధులు రూ.54 కోట్ల 88లక్షల 87వేల 043 రూపాయల అక్రమ బదిలీలు
* యూకేకి చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీ
* రెండు విడతల్లో చెల్లింపు.. మొదట 3/10/2023న రూ.22కోట్ల 69లక్షల 63వేల125
* రెండవ విడత 11/10/2023న 23కోట్ల 01 లక్షల 97వేల 500 బదిలీ
* హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి బదిలీ
* విదేశీ కంపెనీకీ చెల్లింపులతో HMDAకు అదనపు పన్ను భారం
* 8 కోట్ల 6 లక్షల 75వేల 404 రూపాయల అదనపు పన్ను భారం పడింది
* రూ.10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం, ఆర్ధిక శాఖ అనుమతి అవసరం
* సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్కు స్పాన్సర్స్ లేకపోవడంతో HMDA నిధులను దారి మళ్లించిన వైనం