ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు.. దాన కిశోర్ స్టేట్మెంట్ రికార్డ్

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వం ఈ కేసును సీరియస్‎గా తీసుకోవడంతో ఏసీబీ దర్యాప్తు స్పీడప్ చేసింది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దాన కిశోర్ స్టేట్మెంట్‎ను ఏసీబీ రికార్డ్ చేసింది. 

దాన కిశోర్‎ను దాదాపు 7 గంటల పాటు సుధీర్ఘంగా విచారించిన అధికారులు ఆయన వాంగూల్మం రికార్డ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను దాన కిశోర్ దగ్గరి నుండి స్వాధీనం చేసుకున్నారు. దాన కిశోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‎కు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డు హూస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేబినెట్ ఆమోదం లేకుండా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్‎కు విరుద్ధంగా అప్పటి మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ నోటి మాట మేరకు హెచ్ఎండీఏ కార్ రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.55 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఏదైనా విదేశీ సంస్థకు ప్రభుత్వం డబ్బు ట్రాన్స్‎ఫర్ చేయాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. కానీ అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి రూ.55 కోట్లు ట్రాన్స్‎ఫర్ చేసినట్లు తేలడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఫార్ములా ఈ కార్ రేస్ రేసింగ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి మంత్రి కేటీఆర్ ఏ1, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‎ను ఏ2 నిందితులుగా చేర్చి విచారణలో దూకుడు పెంచింది. 

మరోవైపు ఫార్మూలా ఈ కార్ రేసింగ్ వ్యవహరంలో తనపై నమోదైన కేసును కేటీఆర్ హై కోర్టులో సవాల్ చేశారు. దీంతో 2024, డిసెంబర్ 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో కార్ రేసింగ్ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.