డీఈవో ఆఫీసుల ముట్టడి

  •     ఏబీవీపీ,ఏఐఎస్​ఎఫ్​ల ధర్నా

వనపర్తి టౌన్, వెలుగు: ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్​ చేస్తూ వనపర్తి డీఈవో ఆఫీస్​ను ఏబీవీపీ నాయకులు శుక్రవారం ముట్టడించారు. కలెక్టరేట్​లోనే డీఈవో ఆఫీస్ ఉండడంతో  గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అకకడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్పితే అమలు చేయడం లేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్ మండిపడ్డారు. 

ఏళ్ల తరబడి  గవర్నమెంట్ స్కూళ్లల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి గవర్నమెంట్ స్కూళ్లల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, వేణుగోపాల్, కేదార్నాథ్, దేవి, అరవింద్, జ్ఞానేశ్వర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


మహబూబ్​నగర్ కలెక్టరేట్/ నారాయణపేట: ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్​లోని డీఈవో కార్యాలయం ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబివీపీ పాలమూరు జిల్లా కన్వినర్ సతీష్ మాట్లాడుతూ..  విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్స్​, పుస్తకాలు సరిపడ అందలేదని విమర్శించారు. రాష్ర్ట ప్రభుత్వం విద్యా శాఖ మంత్రిని నియమించకపోవడం వల్లే విద్యాశాఖలొ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. మరోవైపు, నారాయణపేటలో డీఈవోకు వినతిపత్రం అందజేశారు. 

గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఈవో ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. స్కూళ్లలో యూనిఫామ్స్, బుక్స్ ఇష్టారాజ్యంగా అమ్ముతున్నా జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్న క్వాలిటీ విద్యను అందించడం లేదన్నారు.