- లోన్లు కట్టని 5,200 కంపెనీలు
- కనీస బాకీ రూ.ఐదు కోట్లు
న్యూఢిల్లీ: కంపెనీల మొండిబాకీలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది డిసెంబరు 31 నాటికి మనదేశంలో 5,200 కంపెనీల లోన్లు మొండిబాకీలు (ఎన్పీఏలు)గా మారాయని కేంద్రం సోమవారం పార్లమెంటులో ప్రకటించింది. షెడ్యూల్డు కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు), ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు ఆర్బీఐకి ఈ వివరాలు తెలిపాయని, ఎన్పీఏ సగటు విలువ కనీసం రూ.ఐదు కోట్లు ఉందని వెల్లడించింది. రూ.ఐదు కోట్ల కంటే ఎక్కువ బకాయి ఉన్న కంపెనీల వివరాలను సేకరించడానికి ఆర్బీఐ.. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్‌ఐఎల్‌సీ)ను మొదలుపెట్టిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ చెప్పారు. సర్ఫేసీ చట్టం ప్రకారం 2015–16 నుంచి 2020–21 వరకు 11.25 లక్షల మంది బారోవర్లపై చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. అప్పుల కారణంగా 2020లో 5,213 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలను బట్టి తెలుస్తోందని అన్నారు. గత జనవరి నాటికి మనదేశంలో 600 యాప్స్ ఇల్లీగల్‌గా అప్పులు ఇస్తున్నట్టు గుర్తించామని కరాద్ వివరించారు.
